నమస్తే నెట్వర్క్, జూలై 9 : కేంద్రం ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన చట్టాలు, ప్రైవేటీకరణ విధానాలపై కార్మికులు కన్నెర్ర చేశారు. శ్రామికుల హక్కులకు గొడ్డలిపెట్టుగా మారిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేసి.. 29 కార్మిక చట్టాలను పునరుద్ధరించాలనే ప్రధాన డిమాండ్‌తో బుధవారం దేశ వ్యాప్తంగా చేపట్టిన సార్వత్రిక సమ్మె మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో విజయవంతమైంది. ఆయాచోట్ల వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు తీసి.. ధర్నాలతో హోరెత్తించారు. కేంద్రం దిగి వచ్చి డిమాండ్లను నెరవేర్చాలని, లేదంటే నిరవధిక సమ్మెకు దిగుతామంటూ హెచ్చరించారు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జీవిత బీమా కార్యాలయం ఎదుట ఆలిండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు నిరసన తెలిపారు. ఎల్ఐసీ సంస్థలో వాటాల విక్రయం రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ నిలిపివేయాలని డిమాండ్ చేశారు. చెన్నూర్ పట్టణంలోని రావి చెట్టు నుంచి ప్రధాన రహదారుల గుండా కార్మిక, ప్రజా సంఘాల నాయకులు ర్యాలీ తీశారు. తాండూర్ తహసీల్దార్ కార్యాలయం నుంచి ఐబీ చౌరస్తా వరకూ సీఐటీయూ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన కార్మికులు, అంగన్ వాడీ టీచర్లు, ఆయాలు భారీ ర్యాలీ తీశారు.
మందమర్రి ఏరియా లోని కాసిపేట 1, 2 ఇైంక్లెన్ గనుల ఉద్యోగులు, జేఏసీ సంఘాల నాయకు ల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ తీశారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం లోని అంబేద్కర్ చౌక్ వద్ద కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టారు. కెరమెరి మండల కేంద్రంలో తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కాగజ్‌నగర్ పట్టణంలో సీఐటీ యూ, సీపీఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ తీశారు. కౌటాల మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం నుంచి బస్టాండ్ వరకు కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు భారీ ర్యాలీ తీశారు.
సింగరేణిలో సమ్మె సక్సెస్
జాతీయ కార్మిక, ప్రాంతీయ కార్మిక సంఘాలు చేపట్టిన సార్వత్రిక సమ్మె సింగరేణి వ్యాప్తంగా విజయవంతమైంది. శ్రీరాంపూర్ కాలనీ బస్టాండ్ వద్ద గల జాతీయ రహదారి వద్దకు ర్యాలీగా చేరుకొని గంట పాటు రాస్తారోకో చేశారు. భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా రోడ్డుపై బైఠాయించారు. జేఏసీ కార్మిక సంఘాల నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య (ఏఐటీ యూసీ రాష్ట్ర అధ్యక్షుడు), ఐఎన్టీయూసీ ప్రధానకార్యదర్శి జనక్‌ప్రసాద్, టీబీజీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు బండి రమేశ్, సీఐటీయూ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు బాలాజీ, కార్యదర్శి చంద్రశేఖర్, ఇఫ్టూ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, హెచ్ఎంఎస్ ఉపాధ్యక్షుడు అనిల్‌రెడ్డి, కేంద్ర నాయకులు తిప్పారపు సారయ్య, టీఎస్ యూఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సమ్ము రాజయ్య, కార్యదర్శి నీరటి రాజయ్య, పోషం ఆధ్వర్యంలో గనులపై, ఓసీపీలపై ధర్నాలు చేసి నిరసన వ్యక్తం చేశారు.
గనులు, ఓసీపీల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. బెల్లం పల్లి పట్టణంలోని శాంతిఖని గని ఆవరణలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. సివిక్ కార్యాలయం నుంచి బజార్ ఏరియా, అంబేద్కర్ చౌరస్తా వరకు ఐఎఫ్టీయూ, టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో మున్సిపల్, సింగరేణి కార్మికులు ర్యాలీ తీశారు. తిలక్‌స్టేడియం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు సీఐటీయూ ఆధ్వర్యంలో ర్యాలీ తీశారు. సీసీసీ కార్నర్ వద్ద హెచ్ఎంఎస్, ఐఎఫ్టీయూ, ఏఐఎఫ్టీయూ, సింగరేణి ఉద్యోగుల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు.
మందమర్రి ఏరియాలో అత్యవసర సిబ్బంది మినహా ఇతర విభాగాల కార్మికులు, ఉద్యోగులు విధులకు హాజరుకాకపోవడంతో గనులు, విభాగాలు బోసిపోయాయి. కార్మిక సంఘాల జేఏసీ నాయకులు ఉదయమే అన్ని గనులు, విభాగాల వద్దకు వెళ్లి, విస్తృత ప్రచారం చేశారు. సీఐటీయూ ఆధ్వరంలో మున్సిపల్ కార్మికులు పాతబస్టాండ్ ఏరియాలో ర్యాలీ తీశారు. బెల్లంపల్లి ఏరియాలోని గోలేటి జీఎం కార్యాలయం ఎదుట జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. డ్యూటీ బస్సుల వద్ద నినాదాలు చేశారు.
1.92 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం
సింగరేణి వ్యాప్తంగా 22 ఓసీపీలు, 20 భూగర్భగనులు, డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్న 42 వేల మంది ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులు విధులు బహిష్కరించారు. సమ్మెతో 1.92లక్షల టన్నులకు బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగింది. సుమారు రూ. 78 కోట్ల నష్టం జరిగింది. కార్మికులు రూ.13.07 కోట్ల వేతనాలు కోల్పోయారు. శ్రీరాంపూర్‌లో 22 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగింది.