మంచిర్యాలటౌన్, జనవరి 18: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటుకు సంబంధించి కీలక అడుగు పడింది. రెండు మున్సిపాలిటీలు, ఎనిమిది గ్రామ పంచాయతీలను విలీనం చేస్తూ మంచిర్యాల కార్పొరేషన్‌గా ఏర్పాటు చేసేందుకు కేబినెట్, అసెంబ్లీలలో చేసిన తీరాన్మాలకు రాజముద్ర (గెజిట్)పడింది. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంతో పాటు తాజాగా జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మంచిర్యాలను కార్పొరేషన్‌గా చేస్తున్నట్లు మంత్రి శ్రీధర్‌బాబు ప్రకటించారు.
ఈ నిర్ణయాలను గవర్నర్ ఆమోదం కోసం పంపగా, ఆయన గెజిట్ విడుదల చేశారు. కార్పొరేషన్ ఏర్పాటుకు మంచిర్యాల, నస్పూరు మున్సిపాలిటీలతో పాటు హాజీపూర్ మండలంలోని పోచంపాడ్, గుడిపేట, నర్సింగాపూర్, నంనూర్, చందనాపూర్, ముల్కల, కొత్తపల్లి, వేంపల్లి గ్రామపంచాయతీలను విలీనం చేయాలని నిర్ణయించారు. అయితే కార్పొరేషన్ ఏర్పాటుకు సంబంధించిన విధివిధానాల జీవో రావాల్సి ఉందని మున్సిపల్ కమిషనర్ మారుతీ ప్రసాద్ తెలిపారు.