నిర్మల్ అర్బన్, మార్చి 20 : నిర్మల్ జిల్లాలో వంట గ్యాస్ వినియోగదారులకు గ్యాస్ తిప్పలు తప్పడం లేదు. ఏజెన్సీల్లో వద్ద గ్యాస్ కోసం గంటల తరబడి వినియోగదారులు పడిగాపులు కాస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనైతే పరిస్థితి మరింత అధ్వానంగా మారింది. గ్యాస్ బుక్ చేసుకున్నా ఇంటికి రాకపోవడంతో ఏజెన్సీల వద్దకు వెళ్తున్నారు. అక్కడ నిర్వాహకులు స్టాక్ లేదని చెప్పడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. శుక్రవారం నిర్మల్‌లోని ఈద్గాం చౌరస్తా వద్ద ఖాళీ సిలిండర్లతో వినియోగదారులు నిరసనకు దిగారు. వెంటనే గ్యాస్ సిలిండర్లు అందించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆందోళన చేసిన విషయం తెలుసుకొని జిల్లా అదనపు కలెక్టర్ కిశోర్ కుమార్ గ్యాస్ ఏజెన్సీలను తనిఖీ చేశారు. ఏజెన్సీలలోని స్టాక్ వివరాలను, నిల్వలను తనిఖీ చేశారు. బుకింగ్ చేసుకున్న వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంటికే గ్యాస్‌ను సరఫరా చేయాలని నిర్వాహకులను ఆదేశించారు.
నిర్మల్ చైన్‌గేట్, మార్చి 20 : నిర్మల్ జిల్లాలోని ప్రభుత్వ వసతి గృహాలకు గ్యాస్ సిలిండర్ల సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా పకడ్బందీగా జరగాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. వసతి గృహాల్లో అందుబాటులో ఉన్న గ్యాస్ సిలిండర్ల స్టాక్ వివరాలను తెలుసుకున్నారు. ప్రతి వసతి గృహంలో సరిపడా సిలిండర్లు అందుబాటులోఉంచాలని, విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూడాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్, ఆర్డీవో రత్నకల్యాణి, జిల్లా పౌరసరఫరాల అధికారి రాజేందర్, డీఈవో భోజన్న, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ శాఖల అధికారులు పాల్గొన్నారు.
జిల్లాలో ప్రజలకు సరిపడా గ్యాస్ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని, ఎవరూ ఆందోళన చెందవద్దని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. నిర్ణీత గడువులోగా డోర్ డెలివరీ చేస్తారని, ఏజెన్సీల వద్దకు ఎవరూ వెళ్లవద్దని, అసత్య వార్తలు నమ్మవద్దని సూచించారు.