కాసిపేట, మార్చి 7 : ‘బెల్లంపల్లి మున్సిపాలిటీకి సంబంధించిన చెత్తను సోమగూడెం పాతబస్తీ శివారులోకి ఎందుకు తీసుకొస్తున్నరు. ఎన్నిసార్లు అడ్డుకున్నా మీరు మారరా..’ అంటూ పెద్దనపల్లి గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం బెల్లంపల్లి నుంచి వస్తున్న చెత్త వాహనాలను కాసిపేట మండలం సోమగూడెం పాత టోల్ గేట్ బ్రిడ్జి వద్ద అడ్డుకొని ఆందోళనకు దిగా రు.
రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. సోమగూడెం పాత బస్తీ శివారులో చెత్త డంప్ చేసి కాల్చ డం వల్ల అనారోగ్యం పాలవుతున్నామని మండిపడ్డారు. ఇక్కడ చెత్త వేయమని అనుమతులెవరు ఇచ్చారంటూ ప్రశ్నించారు. ఆందోళన చేస్తున్న గ్రామస్తులతో మున్సిపల్ అధికారులు ఫోన్లో మాట్లాడగా అనుమతి పత్రం తీసుకొచ్చి చెత్త వేస్తామని, వాహనాలను అక్కడి నుంచి పంపాలని కోరగా, గ్రామస్తులు వినలేదు. మళ్లీ చెత్త తీసుకొస్తే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం ఆందోళన విరమించారు.