రామకృష్ణాపూర్, జూలై 27 : మందమర్రి మండలం బొక్కలగుట్ట గ్రామ పంచాయతీ, క్యాతనపల్లి మున్సిపాలిటీ 9వ వార్డు శివారులో కొలువైన గాంధారి మైసమ్మ బోనాల జాతరను ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ ఆధ్వర్యం లో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయ మండపంలో గ్రానైట్ వేయించారు. చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. టెంట్లు వేసి.. బారికేడ్లు నిర్మించారు.
బొక్కలగుట్ట బస్స్టేజీ వద్ద హైదరాబాద్- నాగ్పూర్ ప్రధాన రహదారి పక్కన కొలువు దీరిన మైసమ్మ జాతరకు ఆసిఫాబాద్ జిల్లాతో పాటు మంచిర్యాల జిల్లాలోని కోల్బెల్ట్ ప్రాంతమైన శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి, గోలేటి, తాండూర్ గనుల ప్రాంతాల నుంచి కార్మిక కుటుంబాలు వేలాదిగా తరలిరానున్నాయి. మంచిర్యాల డీసీపీ భాస్కర్, బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, ఆలయ కమిటీ సభ్యులు శనివారం సాయంత్రం ఏర్పాట్లు పరిశీలించారు. మందమర్రి సీఐ శశిధర్రెడ్డి, రామకృష్ణాపూర్ ఎస్ఐ రాజశేఖర్, కమిటీ సభ్యులు ఉన్నారు.