మంచిర్యాల అర్బన్/కాగజ్‌నగర్/ఆసిఫాబాద్ అంబేద్కర్ చౌక్, సెప్టెంబర్ 17: వాడవాడలా కొలువుదీరిన గణనాథుడు మంగళవారం గంగమ్మ ఒడికి చేరాడు. ధూప, దీప నైవేద్యాలతో విశేష పూజలందుకున్న బొజ్జ గణపయ్యకు భక్తులు ఘనంగా వీడ్కోలు పలికారు. ఆయాచోట్ల ఉత్సాహంగా సాగిన శోభాయాత్రల్లో డప్పు చప్పుళ్లకనుగుణంగా యువతీ యువకులు నృత్యాలు చేశారు. దాండియా, కోలాటాలు ఆడి సందడి చేశారు. ‘గణపతి బప్పా మోర్యా’ నినాదాలతో ప్రధాన వీధులన్నీ మారుమోగాయి. గోదావరి, వాగులు, చెరువుల్లో నమజ్జనం చేసి వెళ్లిరా.. విఘ్నేశ్వరా అంటూ సాగనంపారు. మంచిర్యాలలోని విశ్వనాథ స్వామి కల్యాణ మండపంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడి వద్ద మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్ రావు ప్రత్యే క పూజలు చేశారు.
మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, యువ నాయకుడు విజిత్ రావు పలుచోట్ల వినాయకులను దర్శించుకున్నారు. రామగుండం సీపీ శ్రీనివాస్ పర్యవేక్షణలో డీసీపీ భాస్కర్ బందోబస్తు నిర్వహించారు. కాగజ్‌నగర్ పట్టణంలో ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, ఎమ్మెల్సీ దండె విఠల్, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, ఎస్పీ శ్రీనివాసరావు, సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా ప్రత్యేక పూజలు చేశారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని తుంపెల్లి వాగు వద్ద వినాయక నిమజ్జన ఏర్పాట్లను కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే, డీఆర్వో లోకేశ్వర్‌రావు పరిశీలించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఎస్పీ శ్రీనివాస్ వాసరావు ఆదేశాలతో అడుగడునా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగజ్‌నగర్ డీఎస్పీ రామనుజం ఆధ్వర్యంలో పట్టణ సీఐ శంకరయ్యతో పాటు ఇతర పోలీసు అధికారులు పర్యవేక్షించారు.