ఇచ్చోడ, మార్చి 5: నిత్యం కూలీ పని చేస్తేగాని కడుపు నింపుకోని పరిస్థితి ఆ కుటుంబానిది. ఆ ఇంటి నుంచే ఓ యువతి కేంద్ర బలగాల్లో చేరింది. పట్టుదలే ఆయుదంగా మార్చుకొని గన్ పట్టుకొని శిక్షణ పొందుతోంది. సీఆర్పీఎఫ్లో ఉమ్మడి జిల్లా నుంచి ఎంపికైన తొలి, ఏకైక యువతిగా నిలిచింది. ఇచ్చోడ మండలంలోని అడెగామ (కే) గ్రామపంచాయతీ పరిధిలోని ఆదర్శనగర్‌కు చెందిన గజ్జల లక్ష్మి-రాములు దంపతులకు నలుగురు సంతానం. ముగ్గురు కూతు ళ్లు, ఒక కొడుకు. తండ్రి రాములు రెండేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. ఇంటికి పెద్ద దిక్కును కోల్పోవడంతో తల్లి అన్నీ తానై నిత్యం కూలీగా పని చేస్తూ కుటుంబాన్ని పోషించింది. అప్పు చేసి, కుమారుడు జగదీశ్‌ను బతుకుదెరువు కోసం దుబాయికి పంపించింది. ఇక చిన్న కూతురైన పద్మ పదో తరగతి వరకు ఇచ్చోడలోని ప్రభుత్వ పాఠశాలలో చదివింది. ఇచ్చోడలోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ చదువుతూ సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ అర్హత పరీక్ష రాసింది. ఇందు లో ఉత్తీర్ణత సాధించలేకపోయింది. అయినా వెనుకడుగు వేయకుండా, నిరాశ చెందకుండా.. 2018లో మరోసారి ప్రయత్నించింది. అన్ని అర్హత పరీక్షల్లో పాసై, 2021 జనవరి 21న సీఆర్పీఎఫ్ కాల్ లెటర్ అందుకుంది. ప్రస్తుతం బెంగళూర్‌లోని ఎలంక కేంద్రంలో కానిస్టేబుల్‌గా శిక్షణ పొందుతోంది.
డిగ్రీ చదువుతున్న సమయంలోనే నాకు భద్రతా దళాల్లో చేరాలని అనిపించింది. కేంద్ర బలగాల్లో మహిళలు చాలా కష్టమని నాతో చాలా మంది అన్నారు. అలా నేనెప్పుడూ ఫీలవలేదు. ప్రస్తుతం ట్రైనింగ్ సాఫీగా సాగుతున్నది. అన్న జగదీశ్ నాలో ఎంతో ధైర్యం నూరిపోశారు. అమ్మ దీవెనలతో దేశ సేవకు బయల్దేరడం గర్వంగా ఉంది. ఉమ్మడి జిల్లా నుంచి కేంద్ర బలగాల్లో చేరిన మొదటి యువతిగా నాకు పేరు దక్కింది. ఇందుకు చాలా సంతోషంగా ఉంది. నా తర్వాత మరికొందరు అమ్మాయిలు జిల్లా నుంచి కేంద్ర బలగాల్లోకి వచ్చే అవకాశం ఉంటుందనుకుంటున్న. భయం వీడితే ఏదైనా సాధించవచ్చు. – గజ్జల పద్మ