హాజీపూర్ : హాజీపూర్ మండలం దొనబండ గ్రామ శివారులో ఉన్న ఓ ఫంక్షన్ హాల్లో విద్యుదాఘాతంతో ( Electrocution ) వాచ్మెన్ ( Watchman ) మృతి చెందాడు. లక్షెట్టిపేట మండలం గుల్ల కోటకు చెందిన ఆవునూరు లింగయ్య (55) అనే వ్యక్తి గత 15 ఏళ్లుగా ఫంక్షన్ హాల్లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడని హాజీపూర్ ఎస్సై స్వరూప్ రాజ్ తెలిపారు.
ఫంక్షన్ హాల్ పక్కనే ఉన్న పెట్రోల్ బంక్‌లో ఇనుప స్టాండును పెట్రోల్ బంక్‌లో పనిచేసే బుర్ర వెంకటేష్ గౌడ్ సహాయంతో ఫంక్షన్ హాల్లోకి తీసుకొని వస్తుండగా పైన ఉన్న 11 కె.వి విద్యుత్ తగిలి విద్యుత్ షాక్‌కు గురయ్యారు. ఈ ప్రమాదంలో ఆవునూరు లింగయ్య అక్కడికక్కడే మృతి చెందగా రామగుండం మండలం కుందనపల్లి గ్రామానికి చెందిన బుర్ర వెంకటేశం గౌడ్‌కు గాయాలయ్యాయని వివరించారు.
గాయపడిన వెంకటేష్ గౌడును మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని తెలిపారు. సమాచారం అందుకున్న మంచిర్యాల రూరల్ సీఐ ఆకుల అశోక్, హాజీపూర్ ఎస్సై స్వరూప్ రాజ్, లక్షెట్టిపేట ఎస్సై గోపతి సురేష్, నస్పూర్ ఎస్సైలు ఉపేందర్ రావ్, జితేందర్ సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. మృతుడికి భార్య రాజవ్వ, కుమారుడు జయరాజ్, కుమార్తె వసంత ఉన్నారు. కుమారుడు జయరాజ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.