మంచిర్యాల, ఫిబ్రవరి 26(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉత్తర తెలంగాణకే కవ్వాల్ టైగర్ రిజర్వు(కేటీఆర్) ఫారెస్టు తలమానికంగా నిలుస్తున్నది. కవ్వాల్‌ను ఆకర్షణీయంగా తీర్చిదిద్దడానికి అటవీశాఖ ముమ్మర కసరత్తు చేస్తున్నది. ఇందులో భాగంగా దాదాపు పదమూడేండ్ల క్రితం ప్రారంభించిన సఫారీ వాహనాలను సరికొత్తగా మార్చుతున్నది. పాత నాలుగింటికి తోడు మరో నాలుగింటిని కొనుగోలు చేస్తున్నారు. సందర్శకులకు అనువుగా, సౌకర్యవంతంగా, ఆకర్షణీయంగా ఉండే విధంగా తయారు చేయిస్తుండగా.. వచ్చే నెల నుంచి అందుబాటులోకి రానున్నాయి. కాగా.. ప్రస్తుతం జన్నారం మండలం గోండుగూడ(బైసన్ ట్రాక్) ఒకటే సఫారీకి వాడుతున్నారు. అదనంగా చింతగూడ, లింగంపల్లి, ఖానాపూర్ నుంచి ఉన్న ట్రాక్‌లనూ సఫారీకి ఉపయోగించాలని అటవీశాఖ నిర్ణయించింది. సఫారీ రైడింగ్ చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండగా.. గతేడాది ప్రతినెలా 400-700 మంది వరకు వచ్చేవారు. ఈ ఏడాది జనవరిలో రికార్డు స్థాయిలో 895 మంది రైడింగ్ చేశారు. గతేడాది జనవరి నుంచి 5,841 మంది రైడింగ్ చేయగా, కలెక్షన్ల రూపంలో రూ.13.79 లక్షల ఆదాయం సమకూరింది.
మంచిర్యాల జిల్లా జన్నారం మండల పరిధిలోని కవ్వాల్ టైగర్ రిజర్వు ఫారెస్టులో 2018-19 సంవత్సరంలో సఫారీ రైడింగ్‌ను అటవీశాఖ ప్రారంభించింది. ప్రారంభంలో ప్రతినెలా 200-300 మంది పర్యాటకులు మాత్రమే రైడింగ్ చేసేవారు. క్రమంగా సందర్శకుల సంఖ్య గణనీయంగా పెరగడంతో సఫారీ రైడింగ్ చేసేవారు కూడా పెరిగారు. 2022లో ప్రతినెలా 400-700 మంది వరకు వచ్చారు. ఇక.. ఈ ఏడాది జనవరిలో రికార్డు స్థాయిలో 895 మంది సఫారీ రైడింగ్ చేసినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గతేడాది జనవరి నుంచి 5,841 మంది రైడిం గ్ చేయగా, కలెక్షన్ల రూపంలో వారి నుంచి రూ.13.79 లక్షలు వచ్చాయి. ఏడాది క్రితం వరకు జన్నారం సఫారీ గురించి ప్రచారం లేదు. అడవిని చూడాలని వచ్చి టూరిజం హోటల్స్‌లో దిగిన కొందరు మాత్రమే సఫారీ చేసేవారు. కానీ.. గతేడాది జనవరిలో జన్నారం హైవేపై సఫారీ రైడింగ్ ఆర్చ్ గేట్-1, గేట్-2లను ఏర్పాటు చేయడంతో సఫారీ ఉందని తెలిసింది. మంచిర్యాల, కరీంనగర్, జగిత్యాల, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ నుంచి ఏదైనా పనిమీద ఇటువైపు వచ్చేవారు ఓ రెండు గంటల సమయం కేటాయించి సఫారీ చేసి వెళ్తున్నారు. శని, ఆదివారాలు సెలవు రోజుల్లో ఫుల్ డిమాండ్ ఉంటుంది. రెండు, మూడు రోజుల ముందే వెహికిల్స్ అన్ని బుక్ అవుతున్నాయి.
20 కిలోమీటర్లు.. మూడు స్లాట్స్..
గోండుగూడ ట్రాక్ ద్వారా అడవిలోకి వెళ్తే 20 కిలోమీటర్ల రైడ్ ఉంటుంది. ఉదయం 6.30 నుంచి 8.30 గంటల వరకు..9.30 నుంచి 11.30 గంటల వరకు రెండు ట్రిప్‌లు ఉంటాయి. అనంతరం మధ్యాహ్నం 3.30 నుంచి 5.30 గంటల వరకు రైడింగ్ స్లాట్స్ ఉంటాయి. ఒక్కో స్లాట్‌లో నాలుగు వెహికిల్స్ అందుబాటులో ఉంటాయి. ఒక్కో వాహనంలో ఎనిమిది మంది వెళ్లొచ్చు. అదనంగా వెళ్లాలంటే ఒక్కొక్కరికి రూ.250 చొప్పున చెల్లించాలి. తక్కువగా పది మంది వెళ్లొచ్చు. 73375 52139, 73375 52143 ఫోన్ నంబర్లకు సంప్రదించి రైడ్ బుక్ చేసుకోవాలి. బుక్ చేసుకున్న సమయానికి సఫారీ గేట్ దగ్గరకు వెళ్లే సరిపోతుంది. ప్రత్యేకంగా ఒక రోజు ముందే వెళ్లి ఉండాల్సిన అవసరం లేదు.
అధునాతన వసతులతో కొత్త సఫారీలు
ప్రస్తుతం ఉన్న నాలుగు సఫారీ వాహనాలకు అదనంగా మరో నాలుగు కొత్త సఫారీలను తయారు చేయిస్తున్నారు. ఈ వాహనాల్లో అధునాతన వసతులు ఉండేలా చూస్తున్నారు. కొత్తగా వచ్చే వెహికిల్స్‌లో ఏడుగురు ఒకేసారి ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైడ్‌కు వెళ్లొచ్చు. ఇది కూర్చోవడానికి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. పాత వాహనాల్లో బెంచ్ మోడల్ సీట్స్ ఉండగా కొత్త వాటిలో బకెట్ సీట్లు ఉంటాయి. వాహనం మీద ఎండ తగలకుండా విన్ షీల్డ్ కూడా ఉంటుంది. వాహనం మొత్తం కెమెరా ప్రెండ్లీ, 360 డిగ్రీల వ్యూ ఉంటుంది. ఇటీవల ట్రయల్ రన్ కూడా చేశారు. వాహనం మీద విన్షిల్డ్ అడవిలో కొమ్మలకు తాకుతున్న దృష్ట్యా దాని ఎత్తు కొంత తగ్గించాలని నిర్ణయించారు. ఈ మేరకు నాలుగు వాహనాలు ఇప్పుడు తయారీలో ఉన్నాయి. ఏడాదిలో జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలలు మినహా మిగిలిన అన్ని నెలలు సఫారీ చేయొచ్చు. ఆ నెలల్లో వాతావరణం అనుకూలించదు. కానీ.. కొత్త వాహనాలతో ఆ రోజుల్లో రైడ్ చేసే అంశాన్ని పరిశీలిస్తామని అధికారులు చెబుతున్నారు. అది సాధ్యమైతే ఇక 24/7 కవ్వాల్ అడవుల్లో సఫారీ రైడింగ్ చేసే వీలుంటుంది.
మార్చిలో కొత్త వాహనాలు
అధునాతన వసతులతో సఫారీ వాహనాలను రూపొందిస్తున్నారు. ఒక్కో దానిపై రూ.15 లక్షలు వెచ్చిస్తున్నాం. ప్రస్తుతం ప్రొడక్షన్‌కు వెళ్లాయి. మార్చి మొదటి లేదా రెండో వారంలో సఫారీలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తాయి. వచ్చే పర్యాటకులకు ఎనిమల్ సైటింగ్ జరిగేలా రైడ్స్ ప్లాన్ చేస్తాం. అవసరమైతే కొత్త ట్రాక్‌లను కూడా అందుబాటులోకి తీసుకొస్తాం. ఏడాది కాలంగా సఫారీ రైడింగ్‌కు వచ్చే వారి సంఖ్య పెరిగింది. రానున్న రోజుల్లో మరింత పెరుగుతుందని ఆశిస్తున్నాం.
– శివ్ ఆశిష్ సింగ్, డీఎఫ్‌వో, మంచిర్యాల.