మంచిర్యాల, జూలై 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : చెన్నూర్‌లోని ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల్లో అపరిశుభ్ర దుస్థితిపై నాలుగు రోజుల క్రితం వార్తా పత్రికలు, న్యూస్ చానెళ్లలో పెద్ద ఎత్తున వార్తలొచ్చాయి. అది మరచిపోక ముందే గత శుక్రవారం అంతకుముందు చెన్నూర్ మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాల నుంచి 14 ఏండ్ల విద్యార్థి మిస్ అయ్యాడు. సోషల్ మీడియా సాయంతో ఆ పిల్లాడు కరీంనగర్ నుంచి హుజురాబాద్ వెళ్లే బస్సులో ఉన్నట్లు గుర్తించి కేశవపట్నం సమీపంలో పట్టుకున్నారు.
హమ్మయ్య అనుకునేలోపే చెన్నూర్ మైనార్టీ గురుకుల పాఠశాలలో 40 మంది విద్యార్థులకు కారంతో కూడిన భోజనం పెట్టినట్లు సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్ అయ్యాయి. దానిపై ఆదివారం మంత్రి వివేక్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగానే.. సోమవారం కోటపల్లి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఓ 17 ఏళ్ల మైనల్ బాలిక మిస్ అయ్యింది. 24 గంటల గడుస్తున్నా ఆచూకీ లభించలేదన్న విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలు అన్ని చెన్నూర్ నియోజకవర్గంలో గతంతో పోలిస్తే గురుకులాలు, పాఠశాలల్లో విద్యావ్యవస్థ గాడి తప్పిందంటే.. పట్టించుకోవాల్సిన ప్రభుత్వ పెద్దలు ప్రస్టెషన్లో కాడి వదిలేసినట్లు మాట్లాడుతున్నారన్న చర్చ చెన్నూర్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
మైనార్టీ గురుకులంలో జరిగింది ఇదీ..
బీఆర్ఎస్ నాయకుడు, జడ్పీ మాజీ వైస్ చైర్మన్ చెన్నూర్‌లోని మైనార్టీ గురుకుల పాఠశాలలో చదువుతున్న తన మనుమడిని చూడటానికి రెండు రోజుల క్రితం వెళ్లారు. ఆ సమయంలో పాఠశాలలో కనీస వసతులు లేవని విద్యార్థులు చెప్పడంతో డార్మెంటరీకి వెళ్లి చూశారు. అక్కడ బాత్ రూమ్‌ల నుంచి లీకైన నీటీతో డార్మెంటరీ నిండి ఉండటాన్ని గమనించి, విషయాన్ని ప్రిన్సిపాల్, వార్డెన్ల దృష్టికి తీసుకెళ్లేందుకు డైనింగ్‌హాల్‌కు వెళ్లగా, దాదాపు 40మంది విద్యార్థులు కారంతో కూడిన భోజనం చేస్తూ కనిపించారు. ఈ విషయాన్ని ఆయన ఆధారాలతో సహా తీసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో మైనార్టీ గురుకుల పాఠశాల ముందు బీఆర్ఎస్ శ్రేణులతో కలసి ధర్నా చేశారు.
ఇది అసలు విషయం.. అనుచరుల కోసం తరలింపును ఆపిందెవరు..?
చెన్నూర్ మైనార్టీ గురుకుల పాఠశాల సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతుందని, చెన్నూర్ నుంచి మందమర్రికి ఆ పాఠశాలలను తరలించాలని టీఎంఆర్ఈఐఎస్ సెక్రటరీ ఆదేశాలిచ్చారు. ఆయన ఎందుకు ఆదేశాలిచ్చారంటే.. చెన్నూర్ మైనార్టీ గురుకులంలోని క్లాస్ రూముల్లో తగినంత వెంటిలేషన్ లేదు. ప్లే గ్రౌండ్ లేక విద్యార్థులు ఫిజికల్ యాక్టివిటీస్ చేయలేకపోతున్నారు. స్కూల్ నిర్వహిస్తున్న భవనం గ్రౌండ్ ప్లోర్లో ఫర్టిలైజర్ షాప్ ఉండటంతో కెమికల్స్ నుంచి పిల్లల రక్షణ ప్రశ్నార్థకంగా మారింది. డ్రైనేజీ లీకేజీ సమస్యతో క్లాస్ రూమ్‌లలో దుర్గంధం వస్తుంది. దాదాపు 300 మంది విద్యార్థులు చదువుతున్న స్కూల్ బిల్డింగ్ అపార్ట్మెంట్ టైమ్‌లో కేవలం 13,964 ఎస్ఎఫ్టీల్లో ఉంది. ఇది పిల్లలకు సరిపోవడం లేదు.
అన్నింటికీ మించి మైనార్టీ అడ్మిషన్లకు ఇది సరైన ప్రాంతం కాదు.. అని అధికారులే గుర్తించి టీఎంఆర్ఈఐఎస్ సెక్రటరీకి నివేదించారు. ఈ మేరకు మందమర్రికి మార్చేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. సరిగ్గా అదే సమయానికి సదరు బిల్డింగ్ యాజమాని అధికార పార్టీ నాయకుడు కావడంతో.. ఇక్కడి నుంచి గురుకులం తరలించబోమని.. అవసరమైతే రూ.10 లక్షలు ఇచ్చి అన్ని వసతులు కల్పిస్తామని మంత్రితో ప్రకటన చేయించారన్న ఆరోపణలు అప్పట్లో గుప్పుమన్నాయి. మైనార్టీ గురుకుల విద్యార్థుల భవిష్యత్కంటే.. మంత్రికి ఆయన పార్టీ నాయకుడి ప్రయోజనాలే ముఖ్యమమయ్యాయని ఆరోపణలు వినిపస్తున్న సమయంలో.. బీఆర్ఎస్ నాయకులు గురుకులాన్ని పరిశీలించడం, అక్కడ సమస్యలను వెలుగులోకి తెవడం.. మంత్రి జీర్ణించుకోలేకపోయారన్న విమర్శలు వస్తున్నాయి.
ఎంక్వైరీకి ఆదేశించిన మంత్రి..
గురుకులాలు, పాఠశాలల్లో లోపాలు గుర్తించి, అందుకు బాధులైన వారిపై చర్యలు తీసుకొని సరిచేయాల్సింది పోయి.. ఆదివారం నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి వివేక్ మాట్లాడుతూ.. “గురుకుల పాఠశాలలో విద్యార్థులు మంచిగా కూరగాయలతో భోజనం చేశారు. బీఆర్ఎస్ నాయకులు డ్రామా, షో చేయడానికి అక్కడ తొక్కు (కారం) పెట్టినట్లు చూపించారు. నిజంగా ఇది చాలా బాధాకరం. మనమందరం కూడా మన ఇండ్లళ్ల ఒక్కోసారి అంతరం తిన్న తర్వాత ఏమన్నా మిగిలి పోతే తింటం. తప్పేమీ లేదు.
కానీ, కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురదజల్లాలని చెప్పి.. ఒక రాంగ్ పోస్టు పెట్టి వారు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో… ఇన్స్పెక్టర్గారూ (స్థానిక సీఐని ఉద్ధేశించి) చెప్పుతున్నాను. జాగ్రత్తగా ఉండూ బన్సీలాల్. ఐయామ్ నాట్ హ్యాపీ. దిచ్ కైండ్ ఆఫ్ థింగ్ అప్పెండ్. ఎట్లా పోతరయ్యా హాస్టల్లోకి.. ఎవరైనా ఇండ్యూవిజ్యూల్గా. ఇది కారెక్టా, ఎవరు పోనిచ్చారో కరెక్టుగా ఇన్విస్టెగేషన్ చేయాలి. హాస్టల్లోకి ఎవరూ పోలేరు, ఎవరైతే ఫొటోలో చూపించినారో, వారే ఈ రోజు స్టేట్మెంట్ ఇచ్చారు. మాకు మంచి భోజనం పెట్టుతున్నారని, ఎందుకు మంచిగా అభివృద్ధి నడిచేటప్పుడు తప్పుడు ప్రచారాలు, సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడుతున్నారో.. దీనికి వ్యతిరేకంగా కూడా ప్రజలు నిజాలను పెట్టాలి.’ అంటూ మంత్రి వివేక్ వెంకటస్వామి ఆదివారం చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి.
ఇన్ని రోజులు ఏమైపోయారు..
విద్యార్థులు కారం తినలేదన్నది మంత్రి చెప్పినట్లు వాస్తవమే కావచ్చు.. కానీ ఈ ఏడాది మార్చి 25వ తేదీన చెన్నూర్ పట్టణంలోకి సోషల్ వెల్ఫేర్ స్కూల్లో 7వ తరగతి చదువుతున్న శ్రీహిందూ అనే విద్యార్థిని హాస్టల్లోనే పురుగుల మందు ఆత్మహత్య చేసుకుంది. ఉపాధ్యాయుల వేధింపులతోనే ఆ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందని అప్పట్లో వార్తలొచ్చాయి. ఆ విద్యార్థిని చనిపోయిన పది రోజులు గడవక ముందే అదే స్కూల్‌కు సంబంధించి మరో విద్యార్థిని టాయిలెట్ క్లీనర్ తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఇప్పటి దాకా బాధితులకు ఎలాంటి న్యాయం జరగలేదు. వారి విషయంలో మంత్రి ఎలాంటి చొరవ తీసుకోలేదు.
విద్యార్థినులు ప్రాణాలు పోతున్నా పట్టించుకోని వారు.. ఇప్పుడు కేవలం కారంతో భోజనం పెడుతున్నారన్న వార్తలపై ఎందుకు ఇంత సీరియస్ అయ్యారు. వరుస ఘటనలు వెలుగులోకి రావడంతో పాటు అనుచరులకు సంబంధించిన బిల్డింగ్‌లో మైనార్టీ గురుకులం నడుస్తుండం.. దానిపై సైతం వార్తలు రావడంతోనే మంత్రి ఇలా స్పందించారన్న ఆరోపణలు వస్తున్నాయి. నిజంగా పిల్లల భవిష్యత్‌పై చిత్తశుద్ధి ఉంటే.. టీఎంఆర్ఈఐఎస్ సెక్రటరీ ఆదేశాల మేరకు పాఠశాలలను మైనార్టీ గురుకులాన్ని అన్ని వసతులున్న మందమర్రి సింగరేణి భవనంలోకి మార్చాలన్న డిమాండ్ ఇప్పుడు స్థానికంగా వినిపిస్తున్నది. దీనిపై మంత్రి ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.