ఆదిలాబాద్ : జిల్లాలో నకిలీ పత్తి విత్తనాలు ( Fake Cotton seeds ) విక్రయిస్తున్న నలుగురిని జిల్లా పోలీసులు అరెస్టు( Arrest ) చేశారు. బేల పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి( DSP Jeevan Reddy ) వివరాలు వెల్లడించారు.
సాంగిడి గ్రామ శివారులో కొంతమంది వ్యక్తులు నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్నట్లు సమాచారం మేరకు పోలీస్ సిబ్బంది అక్కడికి వెళ్లి తనిఖీలు నిర్వహించగా నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని వివరించారు. వారి వద్ద ఉన్న విత్తనాలను వ్యవసాయ శాఖ అధికారిని సంఘటనా స్థలానికి పిలిపించి పరిశీలించగా విత్తనాలు నకిలివని తేలాయని పేర్కొన్నారు.
గుజరాత్‌కు చెందిన నరేష్ క్రాప్ సైన్స్ కంపెనీకి పత్తి విత్తన ప్యాకెట్లను నకిలీ పత్తి విత్తనాలుగా తయారు చేసి విక్రయిస్తున్నట్లు గుర్తించామని తెలిపారు. జిట్టావార్ కిషోర్ రెడ్డి, రక్తావర్ పవన్, నవగరే కునాల్, కుల్దీప్ టాక్రె ను అదుపులోకి తీసుకున్నామని, మరొకరు పరారీలో ఉన్నారని వివరించారు. వీరి వద్ద నుంచి రూ. 60 వేల నగదు, 150 నకిలీ పత్తి విత్తనాల ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ వెల్లడించారు. ఈ సమావేశంలో ఆదిలాబాద్ రూరల్ సీఐ కె ఫణిదర్, ఎస్సై మధు కృష్ణ ,సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.