ఎదులాపురం, ఆగస్టు 24 : ముసాయిదా నూతన రెవెన్యూ చట్టం-2024 చర్చా వేదిక కార్యక్రమంలో శనివారం కలెక్టర్ రాజర్షి షా, ఎమ్మెల్యే పాయల్ శంకర్, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, వివిధ సంఘాల అధ్యక్షులు కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ.. చర్చా వేదిక ద్వారా వెల్లడైన అందరి అభిప్రాయాలను క్రోడీకరించి ప్రభుత్వానికి పంపిస్తామని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికే నూతన ఆర్వోఆర్ ముసాయిదా బిల్లు-2024పై ప్రజల నుంచి సీసీఎల్ఏ వెబ్సైట్ ద్వారా సూచనలు, సలహాలు స్వీకరించిందని గుర్తు చేశారు. జిల్లా స్థాయిలోనూ మేధావులు, రెవెన్యూ చట్టంపై అవగాహన కలిగి ఉన్న వారి అభిప్రాయాలను తెలుసుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్చా వేదిక కార్యక్రమం నిర్వహించామన్నారు.
ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ.. సేవలు సులభంగా, వేగంగా అందడంతోపాటు రెవెన్యూ వ్యవస్థ బలోపేతం అవుతుందనిదన్నారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ఆగస్టు 2 నుంచి 23 వరకు సీసీఎల్ఏ వెబ్సైట్లో అభ్యంతరాల స్వీకరణకు తమ అభిప్రాయాలను పోస్టు, వెబ్సైట్లో దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించిందన్నారు. జిల్లా స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు భూమికి ఒక నంబర్ ఉండాలన్న ఉద్దేశ్యంతో భూధార్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. రైతు సంఘాల అధ్యక్షులు గోవర్ధన్ యాదవ్, బండి దత్తత్రి మాట్లాడుతూ.. సెక్షన్ 2024లో 20 సెక్షన్లో ధరణి రద్దు చేయాలని, పార్డ్(బీ) పెండింగ్‌లో ఉన్న కేసులను, సాదాబైనామా ప్రకారం సత్వరమే పరిష్కరించాలన్నారు. ఈ చర్చా వేదికలో ఆదిలాబాద్, ఖానాపూర్ ఆర్డీవోలు వినోద్ కుమార్, జీవాకర్‌రెడ్డి, కలెక్టరేట్ ఏవో రాం రెడ్డి పాల్గొన్నారు.