కుమ్రం భీం ఆసిఫాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ) : కుమ్ర భీం ఆసిఫాబాద్ జిల్లాలో పులి సంచారంతో ప్రజల్లో భయాందోళన నెలకొన్నది. మంగళవారం ఆసిఫాబాద్ మండలంలోని ఈదులవాడ అటవీ ప్రాంతంలో ఆవుపై పులి దాడి చేసి చంపిన ఘటనతో సమీప గ్రామాల ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. గత నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు పశువులు, మనుషులపై పులి దాడులు చేసిన ఘటనలు జరిగాయి. ఆగస్టు నెలలోనూ జనావా సాల్లోనూ పులి సంచరిస్తుండడం ఆందోళన కలిగిస్తున్నది.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ప్రాణహిత సరిహద్దులోని కాగజ్‌నగర్ డివిజన్లోని బెజ్జూర్, కాగజ్‌నగర్, పెంచికల్పేట్, దహేగాం అటవీ ప్రాంతాల్లోనే పులులు ఎక్కువగా సంచరించేవి. కొద్ది రోజుల క్రితం కాగజ్‌నగర్‌లోని అంకుసాపూర్ అటవీ ప్రాంతంలో పశువుపై పులి దాడి చేసినట్లు అధికారులు గుర్తించారు. ఇటీవల జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న గుండి అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్లు అడుగులను అటవీ అధికారులు గుర్తించారు. తాజాగా ఆసిఫాబాద్ మండలంలోని ఈదులవాడ అటవీ ప్రాంతంలో ఆవుపై పులి దాడి చేయడంతో అటవీ ప్రాంత సమీప గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
ఆవాసం కోసం వెతుక్కుంటున్న పులి కాగజ్‌నగర్, ఆసిఫాబాద్, తిర్యాణి మీదుగా కవ్వాల్ అడవుల వైపు వెళ్తున్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఇంతకాలం ప్రాణహిత పరివాహక ప్రాంతంలోనే సంచారించే పులులు మిగతా అటవీ ప్రాంతంలోనూ ఆవాసం ఏర్పాటు చేసుకునేందుకు సంచరిస్తున్నట్లు తెలుస్తున్నది. 2015లో కవ్వాల్ అభయారణ్యాన్ని పులి సంరక్షణ కేంద్రంగా ఏర్పాటు చేసినప్పటికీ ఈ ప్రాంతంలో కడెం, తదితర ఫారెస్ట్ ఏరియాల్లో పులి వచ్చి వెళ్లిన ఆనవాళ్లు గుర్తించినప్పటికీ ఆవాసం మాత్రం ఏర్పర్చుకోలేదు. రెండు రోజుల క్రితం గుండి అటవీ ప్రాంతంలో కనిపించిన పులి తిర్యాణి అడవుల మీదుగా కవ్వాల్ అభయారణ్యంలోకి ప్రవేశిస్తుందని అటవీ అధికారులు భావిస్తున్నారు. కాగజ్‌నగర్ అటవీ డివిజన్లో పులుల సంఖ్య పెరగడంతో కొత్త ఆవాస ప్రాంతాల కోసం పులులు అన్వేషిస్తున్నట్లుగా అటవీ అధికారులు భావిస్తున్నారు.
ఆసిఫాబాద్ జిల్లా గుండి అటవీ ప్రాంతంలో రెండు రోజుల క్రితం పులి అడుగుజాడలను అధికారులు గుర్తించారు. మంగళవారం ఈదులవాడ అటవీ ప్రాంతంలో పులి దాడి చేసి ఓ పశువును చంపేసింది. అంతకు ముందు కాగజ్‌నగర్ మండలం అంకుసాపూర్ అటవీ ప్రాం తంలో పులి దాడి చేసిన సంఘటనలు జరిగాయి. ఆసిఫాబాద్ తిర్యాణి అటవీ ప్రాంతం లో పులి సంచారిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వ్యవసాయ పనులకు వెళ్లేవారు తగిన జాగ్రతలు తీసుకోవాలి.
– నీరజ్ కుమార్ టిబ్రివాల్, డీఎఫ్‌వో, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా