మంచిర్యాల : మున్సిపల్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ( Congress ) పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు ఉమ్మడి జిల్లా జడ్పీ మాజీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి ( Rajireddy ) కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. మంత్రి వివేక్ వెంకటస్వామి( Minister Vivek) పార్టీలో ఒంటెద్దు పోకడలు, ఏకపక్ష నిర్ణయాలు, నియంత పరిపాలన తీవ్రంగా కలిచి వేసిందని పేర్కొంటూ కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. త్వరలో తాను అనుచరులతో కలిసి బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు రాజిరెడ్డి ప్రకటించారు.
ఈ సందర్భంగా రాజీనామాకు గల కారణాలను లేఖ ద్వారా వివరించారు. కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలు, చెన్నూర్ మేనిఫెస్టోకు ఆకర్షితుడినై గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ , స్థానిక శాసన సభ్యుడు గడ్డం వివేక్ విజయానికి విశేష కృషి చేశానని తెలిపారు. అయితే కాంగ్రెస్ ఇచ్చిన హామీలో ఏ ఒక్క హామీని నెరవేర్చ లేదని ఆరోపించారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ హామీలపై ప్రజల్లో తీవ్రమైన ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు.
మంత్రి వివేక్ చెన్నూరు నియోజకవర్గానికి ప్రత్యేకంగా రూపొందించిన మేనిఫెస్టోలో ఒక్క హామీని నెరవేర్చ లేదని దుయ్యబట్టారు. దీనికి తోటు నియోజకవర్గంలో 45 వేల మంది యువకులకు ఉద్యోగాలు, మైనింగ్ ఇన్సిట్యూట్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, అగ్రిరీసెర్చ్ సెంటర్, అగ్రికల్చర్ మినీ యూనివర్సిటీ, కరకట్టల నిర్మాణం హామీ ముందడుగు పడలేదని వెల్లడించారు.
ఎమ్మెల్యే వివేక్‌పై ప్రజల్లో వస్తున్న వ్యతిరేకత, వివేక్ విడుదల చేసి మోసపూరిత మేనిఫెస్టోతో ప్రజల్లో విశ్వసనీయతను కోల్పోవడంతోనే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు.