మంచిర్యాల టౌన్, జనవరి 17: కేసీఆర్ సర్కారు విడుదల చేసిన నిధులతోనే మంచిర్యాల పట్టణంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు అన్నారు. పట్టణంలోని సున్నంబట్టి వాడలో జాతీయ రహదారి నిర్మాణ పనులను బుధవారం బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఆనాటి సీఎం కేసీఆర్ నాయకత్వంలో తాను ఎమ్మెల్యే ఉన్నప్పుడు మంజూరు చేయించిన అభివృద్ధి పనుల్లో భాగంగా పాత మంచిర్యాల నుంచి ఓవర్ బ్రిడ్జి వరకు రూ.12.39 కోట్లతో రోడ్డుకి ఇరువైపులా వెడల్పు, డివైడర్, సెంట్రల్ లైటింగ్ పనులు జరుగుతున్నాయన్నారు.
ఓవర్ బ్రిడ్జి నుంచి తోళ్లవాగు వరకు రూ.15.14 కోట్లతో రోడ్డు వెడల్పు, సెంట్రల్ లైటింగ్, రోడ్డు కి ఇరువైపులా డ్రైన్, ఓవర్‌బ్రిడ్జి పైన హైపర్పాలిస్టర్ షీట్‌తో డాంబర్ రోడ్ వేయడం జరుగుతుందన్నారు. తోళ్లవాగు నుంచి రసూలుపల్లె వరకు రూ. 59.79 కోట్లతో సెంట్రల్ లైటింగ్ ,రోడ్డు వెడల్పు, ఫారెస్ట్ క్లియరెన్స్ మినహా దాదాపు పనులు పూర్తయినట్లు తెలిపారు. ఐబీ నుంచి బెల్లంపెల్లి వరకు రూ.14. 28కోట్లతో పాత ఆర్అండ్బీ రోడ్ని బాగు చేయడం, ఐబీ నుంచి శ్రీనివాస గార్డెన్ వరకు రూ.35 కోట్లతో డ్రైన్, డివైడర్, సెంట్రల్ లైటింగ్‌లకు టెండర్ ప్రక్రియ పూర్తయిందని, త్వరలో పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. ఇలా జిల్లా కేంద్రంలో రూ. 136.60కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని దివాకర్ రావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు సుదమల్ల హరికృష్ణ, గాదె సత్యం, బోరిగాం శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు గోగుల రవీందర్‌రెడ్డి, పడాల రామన్న, పడాల రవీందర్, పడాల శ్రీనివాస్, చంద్రశేఖర్ హండే, బగ్గని రవి, శ్రీపతి వాసు, తదితరులు పాల్గొన్నారు.