మంచిర్యాల టౌన్, ఫిబ్రవరి 25 : మంచిర్యాలలో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదమని, అసలు తమ అభ్యర్థికి ఎందుకు ఓటు వేయాలో వివరించాల్సింది పోయి, బీఆర్ఎస్ అభ్యర్థిని ఎందుకు పెట్టలేదని విమర్శించడం విడ్డూరంగా ఉందని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు, బీఆర్ఎస్ రాష్ర్ట నాయకుడు నడిపెల్లి విజిత్‌రావు ఎద్దేవా చేశారు. మంగళవారం మంచిర్యాలలోని తన నివాసంలో ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ముఖ్యమంత్రి మంచిర్యాలకు వచ్చి కాంగ్రెస్ అభ్యర్థికి ఎందుకు ఓటేయాలన్న అంశంపై మాట్లాడకుండా పోటీలో లేని బీఆర్ఎస్ పార్టీని తిట్టడం ఏమిటని ప్రశ్నించారు.
మరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి కాం గ్రెస్ ఎందుకు అభ్యర్థిని నిలపలేదన్నారు. టీచర్ ఎమ్మెల్సీ మీకు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ మాకు అన్న అగ్రిమెంట్‌తో కాంగ్రెస్, బీజేపీలు లోపాయికార ఒ ప్పందం చేసుకున్నాయని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాం గ్రెస్, బీజేపీ అభ్యర్థులకు బీఆర్ఎస్ గ్రాడ్యుయేట్లు ఓటువేయవద్దని కోరారు. తటస్థంగా ఉన్న వారిలో మంచి వారిని ఎంపిక చేసుకొని వారికి ఓటువేయాల ని, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులను ఓడించాలని పిలుపునిచ్చారు. గతంలో స్థానిక సంస్థల ఎన్నికల కోటాలో ఎవరూ ఓటు వేయకుండా బహిష్కరించారని, వారు ఓటు గురించి మాట్లాడుతున్నారని అన్నారు. ఎమ్మెల్సీ ఓడినా, గెలిచినా తనకేంకాదని సీఎం చెబుతున్నాడని, గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి వచ్చిన దాఖలాలు లేవని ఎద్దేవా చేశారు.
కానీ, రేవంత్‌రెడ్డి మాత్రం ఉన్నఫలంగా మూడుచోట్ల సభలు పెట్టి ఎమ్మెల్సీ అభ్యర్థి తరపున ప్రచారం చేస్తున్నారని, కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోతున్నాడన్న సమాచారం ఉన్నందునే ఈ సభలు నిర్వహించారని తెలిపారు. ఈ ప్రభుత్వం కేవలం ఐదుగురు ఎమ్మెల్యేలతోనే నడుస్తున్నదని, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే స్వయంగా ఈ విషయాన్ని చెబుతున్నారని, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడితే సీఎం కుర్చీ మారడం ఖాయమని అన్నారు. ఎన్నికలకు ముందు అడ్డగోలు హామీలిచ్చి ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. దేశం మొత్తంలో నాలుగువేల పైచిలుకు ఎమ్మెల్యేలు ఉంటే.. అందులో ఎవ్వరిపైనా రానన్ని ఫిర్యాదులు ఇక్కడి ఎమ్మెల్యే పీఎస్సార్‌పై వచ్చాయని, సీఎంకు, డిప్యూటీ సీఎంకు, టీపీసీసీ అధ్యక్షుడికి పీఎస్సార్ బాధితులు పిర్యాదు చేశారని పేర్కొన్నారు. ఆయన వల్ల రౌడీయిజం, గూండాయిజం పెరిగిపోయిందని ఆరోపించారు.
ఇంటిగ్రేటెడ్ మార్కెట్ రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో ఉంటే మంచిర్యాలలో మాత్రం వద్దంటున్నారని, సగం పూర్తయిన భవనాన్ని కూల్చివేశారని చెప్పుకొచ్చారు. దాంతోపాటే ఆర్అండ్బీ ఆఫీస్, గెస్ట్‌హౌస్, క్వార్టర్లు కూల్చేశారని, మార్కెట్లో వెయ్యిషాపులు కూలగొట్టానని స్వయంగా ఎమ్మెల్యేనే చెబుతున్నారని, కేవలం వన్‌వే పెడితే సరిపోయే దానికి షాపులను కూల్చారన్నారు. పైగా సీఎంనే స్ఫూర్తిగా తీసకున్నానని గొప్పగా చెప్పుకోవడం దారుణమని, 80 ఏళ్లకింద కట్టిన ఎండోమెంట్ షాపులను కూడా కూల్చడం ఏమిటని ప్రశ్నించారు. సీఎం వచ్చినందున ట్రాఫిక్ సమస్యలుంటాయని చెప్పి పాఠశాలలను బంద్పెట్టించారన్నారు. టీచర్లందరినీ సభకు తరలించి ఓట్లు అడగడం దారుణమని మండిపడ్డారు.
శ్మశానవాటిక పేరిట కోట్లుదండుకుంటున్న ఎమ్మెల్యే పీఎస్సార్
స్థానిక ఎమ్మెల్యే పీఎస్సార్ శ్మశానం నిర్మాణం పేరిట కోట్లు దండుకుంటున్నాడని మాజీఎమ్మెల్యే దివాకర్‌రావు, బీఆర్ఎస్ నాయకుడు విజిత్‌రావు ఆరోపించారు. నాలుగున్నర కోట్లతో నిర్మిస్తున్నామని చెప్పి ఇప్పుడు రూ. 11 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెబుతున్నారని, ఇంతపెద్ద మొత్తంలో అంచనాలు ఎలా పెరిగాయని ప్రశ్నించారు. శ్మశాన వాటికకోసం వాడిన మట్టి, ఇసుక గోదావరి నది నుంచి అక్రమంగా తీసుకువచ్చిందేనని, దీని బిల్లులు కూడా స్వాహా చేస్తారని, దొంగలెక్కలు చూపించి పెద్ద ఎత్తున నిధులు కాజేయాలని చూస్తున్నారని ఆరోపించారు. అసలు శ్మశాన వాటిక కడుతున్న ప్రదేశమే సరైనది కాదని, తాము శ్మశాన వాటిక నిర్మాణానికి వ్యతిరేకం కాదని, కానీ ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని కట్టాల్సిందని అన్నారు. ఇప్పుడు శ్మశాన వాటిక నిర్మిస్తున్న ప్రదేశానికి దగ్గరలో పలు ఆలయాలు ఉన్నాయని, పండుగలు, పుణ్యస్నానాల కోసం నిత్యం ప్రజలు దీనిముందునుంచే వెళ్లాల్సి ఉంటుందని, దీని వెనకాల ఉన్న ఎంసీహెచ్‌లో పుట్టిన పిల్లలను ఇంటికి తీసుకువెళ్లాలంటే ముందుగా దీని ముందునుంచే తీసుకు వెళ్లాల్సి రావడం దురదృష్టకరమని అన్నారు.
అంతర్గాం బ్రిడ్జి నిర్మించి తీరుతాం
బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే మంచిర్యాల-అంతర్గాం మధ్య గోదావరి నదిపై బ్రిడ్జిని నిర్మించి తీరుతామని దివాకర్‌రావు ధీమా వ్యక్తం చేశారు. ఇక్కడ వంతెన నిర్మించడం వల్ల ప్రజలకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని, దూరభారం తగ్గుతుందని అన్నారు. మంచిర్యాలలో వందేభారత్ రైలును ఆపలేని బీజేపీ నాయకులకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు అడిగు హక్కులేదని అన్నారు. మంచిర్యాలలో అధికారులు ఎన్నికల నియమావళిని తుంగలో తొక్కుతున్నారని, ఎక్కడ చూసినా ప్రచార బోర్డులు, ఫ్లెక్సీలే దర్శనమిస్తున్నాయని, అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం ఏమిటని ప్రశ్నించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు గాదెసత్యం, బేర సత్యనారాయణ, అంకం నరేశ్, తోట తిరుపతి, శ్రీరాముల మల్లేశ్, తాజుద్దీన్, సాగి వెంకటేశ్వరరావు, మధూకర్ పాల్గొన్నారు.