చెన్నూర్, మే 11 : పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ లోకల్ నాయకుడని, ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రజా సేవ చేశారని, సింగరేణి కార్మికుడిగా 25 ఏళ్ల పాటు సేవలందించారని, తెలంగాణ కోసం ఉద్యమం చేశారని, ఆయనను భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన అవసరం మనందరిపైనా ఉందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పేర్కొన్నారు. శనివారం చెన్నూర్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు.
మోస పూరిత వాగ్దానాలతో గద్దెనెక్కిన కాంగ్రెస్‌కు గుణపాఠం తప్పదని, గడిచిన ఐదు నెలల్లో అభివృద్ధి అటకెక్కిందని, ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేశారని మండిపడ్డారు. ప్రస్తుత ఎమ్మెల్యే వివేక్ తనపై ఉన్న కోపంతో కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేసే కుట్ర చేస్తున్నడని, అప్పట్లో తాము మంజూరు చేయించిన అభివృద్ధి పనులను అడ్డుకుంటున్నడని మండిపడ్డారు. పెద్దపల్లి నియోజకవర్గంలో గడ్డం ఫ్యామిలీ ఏ ఒక్క దళిత నాయకుడినీ ఎదగనీయడం లేదన్నారు.
ఈ ఏరియాలో ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా వారి కుటుంబ సభ్యులే ఉండాలనే ధోరణితో వ్యవహరిస్తున్నారని, ఇదంతా ప్రజలు గమనించాలని కోరారు. గడ్డం వివేక్ 2018లో బీఆర్ఎస్లో ఉండేనని.. ధర్మపురిలో కొప్పుల ఈశ్వర్‌ను ఓడించే కుట్ర చేశాడని, అందుకే ఆనాడు ఎంపీ టికెట్ ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ సర్కారు వడ్లను కొనకపోవడంతో రైతులు అష్టకష్టాలు పడుతున్నారని, వర్షాలకు ధాన్యం తడిసిపోయినా పట్టించుకోవడం లేదన్నారు. తమలాంటి దళిత బిడ్డలకు ప్రజలే దిక్కు అని, తమకు మద్దతిస్తే వారికి సేవ చేసుకుంటామన్నారు.
కోట్లు వెనుకేసుకున్నోళ్లం కాదని, నమ్మిన ప్రజల కోసం చివరి శ్వాస వరకూ పనిచేసేటోళ్లమని చెప్పు కొచ్చారు. బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు వేధిస్తున్నారని, కేసులు పెడుతున్నారని, మొన్న రైతు దీక్ష చేస్తామంటే ఇక్కడి సీఐ టెంట్‌ను తొలగించారని, ఈ సీఐ ఖాకీ బట్టలు తీసేసి, కాంగ్రెస్ బట్టలు వేసుకొని కండువా కప్పుకుంటే అయిపోతదన్నారు. బహిరంగ సభకు వస్తున్న బస్సులను అడ్డుకున్నారని, ఇదేం పద్ధతి అని ప్రశ్నించారు. తెలంగాణలో ఏ రోజున కేసీఆర్ టైమ్ వస్తుందో… ఆ రోజు తన టైమ్ కూడా వచ్చినట్లేనని, ఆ రోజు విడిచి పెట్టేది లేదని ఆయన హెచ్చరించారు.