చెన్నూర్ టౌన్/మంచిర్యాల అర్బన్, మార్చి 29 : మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలంలోని గంగారం గ్రామానికి చెందిన రాళ్లబండి రమేశ్-చంద్రకళ దంపతుల కుమార్తె శ్రీహిందూ(13) నాలుగో తరగతి నుంచి చెన్నూర్‌లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల(కళాశాల)లో చదువుతున్నది. గత బుధవారం రాత్రి 10.30 గంటలకు ఆ బాలిక వాంతులు చేసుకోవడంతో స్కూల్ సిబ్బంది చెన్నూర్ ప్రభుత్వ దవాఖానకు తరలించింది. విషయం బయటకు పొక్కకుండా ప్రభుత్వ దవాఖానలో చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం శనివారం రాత్రి మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు.
అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు ఆమె పాయిజన్ తీసుకున్నదని అనుమానించారు. విద్యార్థినిని అడగడంతో పాయిజన్ తీసుకున్నది నిజమేనని చెప్పింది. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందింది. అక్కడి నుంచి వెంటనే విద్యార్థిని మృతదేహాన్ని మంచిర్యాలలోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. బీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌తో పాటు పలువురు విద్యార్థిని తల్లిదండ్రులను పరామర్శించారు.
కాగా, తమ అమ్మాయి అనారోగ్య విషయం చెప్పకపోవడం బాధాకరమని, వాంతులు చేసుకుంటున్నదని సమాచారం ఇచ్చారని బాధిత తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల తీరుపై బాధిత కుటుంబ సభ్యులు, విద్యార్థిని తల్లిదండ్రులు మండిపడ్డారు. తమ కూతురు మృతికి ఉపాధ్యాయుల వేధింపులే కారణమంటూ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

హాస్పిటల్ ఎదుట ఆందోళన..
శ్రీహిందూ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ ఎదుట కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. గురుకుల పాఠశాల నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే తమ పాప మృతి చెందిందని మండిపడ్డారు. బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాస్ అక్కడికి చేరుకొని మృతికి గల కారణాలపై ఆరా తీశారు. మృతురాలి తల్లిదండ్రులు, బంధువులతో మాట్లాడారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని, ప్రత్యేక అధికారిని నియమించి పాప మృతిపై సమగ్ర విచారణ చేయిస్తామని, కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని ఆయన హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈయన వెంట మంచిర్యాల ఏసీపీ ప్రకాశ్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు ఉన్నారు.
ఉపాధ్యాయుల వేధింపులేనంటూ ఫిర్యాదు
ఉపాధ్యాయుల వేధింపులతోనే తమ కూతురు మృతి చెందిందని, ప్రభుత్వ దవాఖానలో చికిత్సపొందిన విషయం కూడా తమకు సమాచారం ఇవ్వలేదని మృతురాలి తండ్రి రాళ్లబండి రమేశ్ పేర్కొన్నాడు. ఈ విషయమై బాధ్యులపై చర్యలు తీసుకోవాలని చెన్నూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ బన్సీలాల్ తెలిపారు.
కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తామన్న రేవంత్ రెడ్డి ప్లాన్‌లో భాగమే : మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్
శ్రీహిందూ కుటుంబ సభ్యులను మంచిర్యాలలోని ప్రభుత్వ దవాఖాన వద్ద బీఆర్ఎస్ నాయకులతో కలిసి చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఉద్దేశపూర్వకంగా కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పిండు. అదేవిధంగా వెయ్యికి పైగా ఉన్న కేసీఆర్ పెట్టిన గురుకులాలను నిర్వీర్యం చేసే కుట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు చేస్తున్నరు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకూ 127 మంది, ఫుడ్ పాయిజన్తోని, ఆత్మహత్యలతోని, వివిధ కారణాలతో చనిపోవడం బాధాకరం.’ అని సుమన్ ఆవేదన వ్యక్తం చేశారు.

మంత్రి వివేక్ రాజీనామా చేయాలి
‘శ్రీహిందూ అనే అమ్మాయిది 128వ ఘటన. మంత్రి వివేక్ గారూ.. ఒక్కరోజైనా మీరు చెన్నూర్ నియోజకవర్గంలోని స్కూళ్ల గురించి గానీ, గురుకులాల గురించి గానీ, సంక్షేమ హాస్టళ్ల గురించిగానీ కనీసం సమీక్ష చేశారా? ఎన్నడైనా మీరు చెన్నూర్ పట్టణంలోని బీసీ గురుకులానికి వెళ్లి అక్కడి పరిస్థితుల గురించి అడిగారా?.’ అని ప్రశ్నించారు. ‘గురుకులాలను పట్టించుకోరు.. స్కూళ్లను పట్టించుకోరు.. సంక్షేమ హాస్టళ్లను పట్టించుకోరు.. మరి మీకు ఎందుకు మంత్రి, ఎమ్మెల్యే పదవులు? దీనంతటికీ నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి వివేక్ వెంకటస్వామి రాజీనామా చేయాలి.’ అని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని, అవసరమైతే తనే రోడ్డు మీదకు వచ్చి కూర్చుంటానని హెచ్చరించారు.