హాజీపూర్, మే 15 : ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కొనుగోళ్లలో తీవ్ర జాప్యం జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు పేర్కొన్నారు. శుక్రవారం హాజీపూర్ మండలం సబ్బపెల్లి, హాజీపూర్, టీకన్నపల్లె గ్రామాల్లోని వరి ధాన్యం, మొక్కల కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్బంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం, మక్కలను కొనుగోలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మే 15వ తేదీ నాటికి 80 శాతం కొనుగోళ్లు పూర్తి చేశామని, ప్రస్తుత ప్రభుత్వం 20 శాతం కూడా చేపట్టకపోవడం దారుణమన్నారు. మరో వైపు వర్షాలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.
కొనుగోలు కేంద్రాల్లో ఎకరాకు 25 క్వింటాళ్ల మక్కలు మాత్రమే కొంటామని, అంతకంటే ఎక్కువ కొనుగోలు చేయలేమని నిర్వాహకులు చేతులెత్తేస్తున్నారన్నారు. మక్క ఎకరానికి 40 క్వింటాళ్లు వస్తుందని, నిబంధనల పేరిట కొనుగోళ్లు చేపట్టకపోవడంతో మిగతా పంటను ఎక్కడ అమ్ముకోవాలని రైతులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. ఇకనైనా ఎలాంటి షరతులు లేకుండా పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మక్కల కేంద్రాలకు గన్నీ సంచులు లేవని, రవాణా చేసేందుకు సైతం లారీలు కూడా అధికారులు పంపిచడం లేదని రైతులు చెబుతున్నారన్నారు. రైతులకు సరిపడా గన్నీ సంచులు ఏర్పాటు చేయలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉందా అన్ని ప్రశ్నించారు. అధికారులు హామీలు ఇస్తున్నారే తప్ప ధాన్యం కొనుగోలు చేయడంలో విఫలమవుతున్నారని పేర్కొనారు.
ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం స్పందించి రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని, లేని పక్షంలో రైతుల పక్షాన పోరాటం చేస్తామని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే వెంట కార్పొరేటర్ సత్తార్, నాయకులు గోగుల రవీందర్ రెడ్డి, హాజీపూర్ సర్పంచ్ మాధవరపు శ్రీలతా-రామారావు, హాజీపూర్ మండల అధ్యక్షులు మొగిళి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి జీవన్ రావు, మాజీ వైస్ ఎంపీపీ మందపెల్లి శ్రీనివాస్, మంచిర్యాల మాజీ పీఏసీఎస్ చైర్మెన్ సందెల వెంకటేశ్, ఒడ్డె బాలరాజు, నయిం పాషా, బేర పోచయ్య, హాజీపూర్ గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు దానయ్య, జనార్దన్ పాల్గొన్నారు.

ఎకరానికి 25 క్వింటాళ్లేనట..
కొనుగోలు కేంద్రానికి మక్కలు తీసుకొచ్చి 25 రోజులైతంది. ఎకరానికి 25 క్వింటాళ్లు మాత్రమే కొంటామని నిర్వాహకులు చెబుతు న్నరు. ఎకరానికి దాదాపు 40 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. మిగితా ఎక్కడైనా అమ్ముకొండి అంటున్నరు. ఇదెక్కడ పద్ధతి. అకాల వర్షాలతో మక్కలు తడిసినవి. మక్కల ను తూకం వేసేందుకు గన్నీ సంచులు కూడా లేవు అంటున్నరు.
– బూర్ల నందయ్య, నర్సింగాపూర్
రైతులను దోచుకుంటున్నరు
హాజీపూర్ కొనుగోలు కేంద్రానికి వచ్చి 25 రోజులైతంది. వర్షానికి తడిసి ధాన్యం మొలకలు వచ్చినయ్, ఎక్కడి ధాన్యం అక్కడే ఉన్నది. 40 కిలోల బస్తాకు 43 కిలోల తూకం వేయడమే కాకుండా లారీ అన్లోడ్ చేసేటప్పుడు బస్తాకు అదనంగా రూ. 2 ఇవ్వాలంటున్నరు. రైతులకు మద్దతు ధర వస్తుందని కొనుగోలు కేంద్రాలకు తీసుక వస్తే, ఇక్కడ రైతులను దోచుకుంటున్నరు.
– దర్వాజ రాములు, హాజీపూర్
మక్కలు తెచ్చి న్లైతంది
మక్కలు కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చి న్లైతంది. ఇప్పటికే అకాల వర్షానికి తడిసి ముద్ద అయినయి. పంట కొంటలేరు. ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యంతో దళారులు పుట్టుకొస్తున్నరు. దళారులు మక్కలు క్వింటాలుకు రూ. 1700 చొప్పున కొంటున్నరు. తప్పనిసరి పరిస్థితుల్లో మద్దతు ధరకంటే రూ.700 తక్కువకు అముకోవాల్సి వస్తుంది.
– గందె శంకరయ్య, టీకన్నపల్లె