జన్నారం, మే 18 : వేసవి నేపథ్యంలో వన్యప్రాణుల సంరక్షణపై అటవీశాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ మేరకు కవ్వాల్ టైగర్ రిజర్వుడు ఫారెస్టులో సహజసిద్ధంగా తాగు నీరందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నది. వాగుల్లో చెలిమెలు, ర్యాంప్వెల్స్ వంటివి ఏర్పాటు చేస్తూనే.. సోలార్ పంపుల ద్వారా కుంటలు, చెరువుల్లో నీటిని నింపుతూ అటవీ జంతువుల దాహార్తిని తీర్చుతున్నది. ఇప్పటికే డివిజన్లోని ఇందన్పెల్లి, జన్నారం, తాళ్లపేట్ రేంజ్ పరిధిలోని 40 బీట్లలో వన్యప్రాణుల తాగు నీటికోసం సౌకర్యం కల్పించింది.
ఐదు చోట్ల సహజసిద్ధమైన నీటి వనరులు ఏర్పాటు చేసింది. 29 సోలార్ పంపులు, 30 ర్యాంప్వెల్స్, 187 కుంటల ద్వారా నీటి వసతులు కల్పిస్తున్నది. వేసవిలో వన్యప్రాణులు దాహార్తిని తీర్చుకునేందుకు అటవీ సమీప గ్రామాల్లోకి వచ్చి ప్రమాదాల బారిన పడుతుండగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అటవీ అధికారులు తెలిపారు.
వేసవిలో దాహార్తిని తీర్చుకునేందుకు అడవి జంతువులు సమీప గ్రామాల్లోకి వెళ్లి ప్రమాదాల బారిన పడుతుంటాయి. ఇందులో భాగంగానే కవ్వాల్ టైగర్ రిజర్వుడు ఫారెస్టులో తాగు నీటికి ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. ప్రతి కిలో మీటర్ పరిధిలో సహజసిద్ధమైన నీటి వసతులు కల్పించాం.
– కారం శ్రీనివాస్, ఇందన్పెల్లి రేంజ్ ఆఫీసర్