ఆసిఫాబాద్ : అడవుల సంరక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని ఆదిలాబాద్ సర్కిల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ రామలింగం అన్నారు. ఆజాది కా అమృత్ మహోత్సవం పురష్కరించుకుని వన్యప్రాణి సంరక్షణ వారోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని జిల్లా అటవీశాఖ కార్యాలయం నుంచి నిర్వహించిన బైక్‌ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అడవుల సంరక్షణతో వాతావరణ సమతుల్యత సాధ్యమవుతుందన్నారు. కేవలం అటవీ అధికారులతో మాత్రమే సంరక్షణ సాధ్యం కాదని, దీంట్లో ప్రజలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. వన్య ప్రాణుల సంరక్షణకు సిబ్బంది నడుంకట్టాలన్నారు. జిల్లాలో అటవీ ప్రాంతం సంరక్షించడంతో పాటు వన్య ప్రాణులను కూడా రక్షించాలన్నారు. ప్రజలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలన్నారు.
ప్రజలతో మమైకమై పని చేసినప్పుడే అటవీ సంరక్షణ సాధ్యమవుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా అటవీ సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో సంరక్షణ కోసం వేగులను ఏర్పాటు చేసే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారి శాంతారాం, డివిజన్ అధికారులు దినేశ్ కుమార్, విజయ్ కుమార్, రేంజ్ అధికారులు అప్పల కొండ, పూర్ణిమ, భూమేశ్ , శ్రీనివాస్, డిప్యూటీ రెంజ్ అధికారులు యోగేశ్,ఝాన్సీరాణి, ప్రవీణ్‌కుమార్, సెక్షన్ అధికారులు, బీట్ అధికారులు పాల్గొన్నారు.