మంచిర్యాల, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నస్పూర్ మున్సిపాలిటీలో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఐదు నెలల వేతనాలు జమయ్యాయి. ‘పండుగ పూట పస్తులు’ శీర్షికతో ఈ నెల 8వ తేదీన ‘నమస్తే తెలంగాణ’లో మున్సిపల్ ఉద్యోగులకు జీతాలు రావడం లేదని, ఈపీఎఫ్, ఈఎస్ఐ జమచేయకపోవడంపై కథనం ప్రచురితమైం ది. దీనికి స్పందించిన అధికారులు జీతాలు జమ చేసినట్లు బుధవారం ఉద్యోగులు తెలిపారు.
ఇక్కడి వ రకు బాగానే ఉన్నా కార్మికులకు రావాల్సిన రూ.1.61 కోట్ల ఈపీఎఫ్ పెండింగ్‌లను క్లియర్ చేస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. మున్సిపాలిటీలో పని చేస్తే 130 మంది కాంట్రాక్ట్ కార్మికులకు నెలకు రూ.2.34 లక్షల చొప్పున 69 నెలల ఈపీఎఫ్ జమకావాల్సి ఉంది. ఈ మొత్తం కార్మికుల జీతాల నుంచి కట్ చేసిన మున్సిపాలిటీ ఈపీఎఫ్ అకౌంట్లలో జమ చేయకుండా సొంత అవసరాలకు వాడుకున్నది. దీనికి ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు.
ఇది కేవలం మున్సిపాలిటీ చేసిన తప్పిదం. రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీలోనూ ఇలాంటి పరిస్థితి లేదు. కానీ కార్మికులను తప్పుదోవ పట్టిస్తూ కొందరు గత ప్రభుత్వం పీఎఫ్ వాడుకుందనే అవాస్తవాన్ని ప్రచారం చేస్తున్నారు. దీనిపై కార్మిక సంఘాల నాయకులు ఏం మాట్లాడకూడదని అధికార పార్టీ నుంచి హుకూం జారీ చేసినట్లు తెలిసింది. కార్మికులకు న్యాయంగా రావాల్సిన పీఎఫ్‌ను మున్సిపాలిటీ వాడుకోవడమే పెద్ద తప్పు కప్పిపుచ్చుకునేలా కార్మికులపై ఒత్తిడి తెచ్చి, బయట ఈ విషయాన్ని ప్రచారం చేయొద్దంటూ వారికి చెప్పడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈఎస్ఐదీ అదే కథ..
ఈపీఎఫ్ ముచ్చట ఇలా ఉంటే కార్మికులకు కట్టాల్సిన ఈఎస్ఐని రెగ్యులర్‌గా జమ చేయాల్సి ఉంది. ఈఎస్ఐ కడితే కార్మికులకు ఎన్నో వెసులుబాట్లు ఉంటాయి. అనారోగ్య పరిస్థితుల్లో పైసా ఖర్చులేకుండా సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలందుతాయి. విధుల్లో ఉండి ప్రమాదవశాత్తు మృతి చెందితే తీసుకుంటున్న మొత్తం జీతంలో 90 శాతం ఆ కుటుంబానికి నెల వారీ పింఛన్‌గా ఇస్తారు.
కానీ మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంతో ఈ సదుపాయాలన్నింటికీ కార్మికులు దూరం అవుతున్నారు. మొన్నటికి మొన్న అనారోగ్యంతో మృతి చెందిన మున్సిపల్ ఉద్యోగి శేఖర్‌కు జరిగింది ఇలాంటి అన్యాయమే. మరో కార్మిక కుటుంబానికి ఇదే పరిస్థితి రాకముందే అధికారులు ఇప్పటి నుంచైనా సమయానికి ఈఎస్ఐ జమ చేయాల్సిన అవసరం ఉంది. మున్సిపాలిటీలో ప్రస్తుతం 130 మంది కాంట్రాక్టు, 86 మంది ఔట్సోర్సింగ్ పద్ధతిలో పని చేస్తున్నారు.
వీళ్లు కాకుండా మరో 20 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ 20 మంది ఏ ప్రాతిపాదికన పనిచేస్తున్నారు అనే విషయంలో ఎవరికీ స్పష్టత లేదు. వీరిలో ఓ 60 ఏళ్ల సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి సైతం ఉన్నారు. అసలు 60 ఏళ్ల వయసున్న వ్యక్తిని ఎలా విధుల్లోకి తీసుకున్నారన్నది అర్థం కావడం లేదు. ఆయన చేతుల్లోనే చెత్త వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఒకవేళ కార్మికుడికి ఏదైనా ప్రమాదం జరిగితే పరిస్థితి ఏంటి..మున్సిపాలిటీ బాధ్యతగా తీసుకునేదా.. ఎందుకు ఆ కార్మికులకు ఎలాంటి తీర్మానం లేకుండా విధుల్లోకి తీసుకున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు. మరి వీటన్నింటినీ మున్సిపాలిటీ త్వరలో చెక్ పెడుతుందా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది.