మంచిర్యాల అర్బన్, సెప్టెంబర్ 26 : పట్టణంలో ఈ నెల 23న అర్ధరాత్రి జరిగిన దాడి కేసులో ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు ఏసీపీ రత్నపురం ప్రకాశ్ తెలిపారు. ఈ మేరకు గురువారం మంచిర్యాల ఏసీపీ కార్యాలయంలో నిందితుల అరెస్ట్‌ను చూపించి వివరాలు వెల్లడించారు. మంచిర్యాలకు చెందిన గడప రాకేశ్ తన అనుచరులతో కలసి దాడులకు పాల్పడుతూ ఆధిపత్యం కొనసాగిస్తున్నాడు. పాత కక్షల నేపథ్యంలో మేర సంజీవ్ గత జూన్‌లో రాకేశ్‌పై దాడికి పాల్పడ్డాడు.
ఈ దాడిపై మేర సంజీవ్‌పై కేసులు కూడా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో సంజీవ్‌పై దాడికి పాల్పడితే తమ ఉనికిని కాపాడుకోవచ్చని రాకేశ్ ప్లాన్ చేశాడు. ఈ క్రమంలో 20 రోజుల క్రితం తన అనుచరులు సంపత్, విశాల్‌తో పాటు మరికొంత మందితో సమావేశమయ్యాడు. సంజీవ్‌ను ఎలాగైనా అడ్డు తొలగించి తమ ప్రాబల్యం పెంచుకోవాలని వారిని అతడిపై దాడికి ఉసిగొల్పాడు.
ఇందులో భాగంగానే సంపత్, విశాల్ తన అనుచరులతో కలసి ఈ నెల 23న అర్ధరాత్రి 12.30 గంటల ప్రాంతంలో బైపాస్ రోడ్‌లోని కాంగ్రెస్ లీడర్ జగన్మోహన్ రావు ఇంట్లో ఉన్న ఆయన సూపర్ వైజర్ మేర సంజీవ్‌పై దాడికి పాల్పడ్డారు. ఇందులో సంజీవ్, తోటమాలి అబ్దుల్ అఫ్రోజ్, వాచ్మెన్ దోమల శంకరయ్యకు గాయాలయ్యాయి. సంజీవ్ తనను తాను కాపాడుకునే క్రమంలో రుద్ర తేజ్, జ్ఞానేశ్వరుకు కూడా గాయాలయ్యాయి. మిగతా వారు తప్పించుకొని పారిపోయారు.
ఈ దాడి కేసులో కుంట శ్రీధర్, పులగం నగేశ్, షేక్ అబ్దుల్ రసూల్, ఎండీ అన్వర్ పాషా, జుమ్మాడా పున్నను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. వారి వద్దనున్న కత్తి, కడియం, ప్లాన్ మ్యాప్, ఫోన్లు సీజ్ చేశారు. మిగితా 14 మంది పరారీలో ఉన్నారని, వారిలో కొంతమందిపై రౌడీ షీట్లు ఉన్నాయని, మిగతా వారిపై కూడా ప్రస్తుతం రౌడీ షీట్లు నమోదు చేస్తామని ఏసీపీ తెలిపారు. ఈ సమావేశంలో సీఐ బన్సీలాల్, ఎస్ఐలు సనత్‌కుమార్, సురేశ్ పాల్గొన్నారు.