సారంగాపూర్, ఫిబ్రవరి 26 ః మత్స్యకారులకు ఉపాధి కల్పించడానికి, ప్రయాణికులకు రుచికరమైన, బలవర్ధకమైన ఆహారం అందించడానికి రాష్ట్ర సర్కారు నూతన నిర్ణయానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే మత్స్యకారులకు ఉచితంగా చేపపిల్లలు పంపిణీ చేసి ఆర్థిక భరోసా కల్పిస్తుండగా.. ప్రస్తుతం ఆర్టీసీ బస్టాండ్లలో ఫిష్ ఫుడ్‌కోర్టుల ఏర్పాటుకు కరసత్తు చేస్తున్నది. మేక, గొర్రె, కోడి మాంసం ఖరీదైనదిగా మారడంతో సామాన్యులు, ప్రయాణికులకు అందుబాటులో ఉండడానికి చేపలు, రొయ్యల ఫ్రై, కర్రీ, చట్నీల దుకాణాలు ఏర్పాటుకు చాన్స్ కల్పిస్తున్నది. మత్స్యకారులకే అవకాశం కల్పిస్తుండగా.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నాలుగు బస్టాండ్లను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. ఇక్కడ విజయవంతమైతే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నారు. దీంతో మత్స్యకారులకు జీవనోపాధితోపాటు ఆర్థికంగా బలపడడానికి ఆస్కారం ఉంటుంది.
రాష్ట్ర ప్రభుత్వం కులవృత్తులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నది. ప్రాజెక్టులు, చెరువులు, కుంటలలో మత్య్సకారులు పెంచడానికి ఉచితంగా చేప, రోయ్య పిల్లలను పంపిణీ చేస్తున్నది. వారి జీవన ప్రమాణాలు పెంచి, ఆర్థిక భరోసా ఇస్తున్నది. ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి చేపలు, రొయ్యలతో తయారు చేసిన ఆహార పదార్థాలను విక్రయించేందుకు బస్టాండ్లలో ఫిష్ ఫుడ్‌కోర్టుల ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. గత నెలలో మత్స్యభవన్ నుంచి మత్స్యశాఖ మేనేజింగ్ డైరెక్టర్ లచ్చిరామ్ భూక్య ఉత్తర్వులు కూడా విడుదల చేశారు. పైలెట్ ప్రాజెక్టుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నాలుగు బస్టాండ్లలో ఏర్పాటు చేయనున్నారు. ఇవీ.. విజయవంతంగా నడిస్తే మిగిలిన బస్టాండ్లలో ఏర్పాటు చేయనున్నారు. మత్స్యకారులు ఫిష్ ఫుడ్‌కోర్టులు ఏర్పాటు చేసుకునేందుకు ప్రతి ఆర్టీసీ బస్టాండ్‌లో లీజుకు స్థలాన్ని కేటాయించాలని కోరుతూ మత్స్యశాఖ రాష్ట్ర కార్యాలయం నుంచి ఆర్టీసీ రీజినల్ మేనేజర్లకు అధికారికంగా లేఖలు అందాయి. ప్రస్తుతం ప్రయాణ ప్రాంగణాల్లో ఉన్న క్యాంటీన్, వాటర్, ఇతర వ్యాపార దుకాణాల మాదిరిగానే చేపలు, రొయ్యలతో తయారు చేసిన ఫ్రై, కర్రీ, చట్నీలు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా 459 మత్స్య సహకార సంఘాలు ఉండగా.. 26,932 మంది సభ్యులు ఉన్నారు.
ఆరోగ్య ఆహారం..
ప్రాజెక్టులు, చెరువులు, కుంటలలో యేటా కోట్లలో చేపలు, రొయ్యలు వదిలి పెరిగిన తరువాత వేసవిలో వాటిని పట్టి ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తారు. అలాకాకుండా స్థానికంగా పెంచిన చేపలు, రొయ్యలు ఈ ప్రాంతాలవారికీ సరిపడా వినియోగించాకే మిగిలినవి ఎగుమతి చేయాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గ్రామీణులకు ఆరోగ్యకరమైన చేపలు, రొయ్యల ఆహారం చౌకగా అందుబాటులో ఉండేందుకు ప్రభుత్వం ఫిష్ ఫుడ్‌కోర్టులను ఏర్పాటు చేస్తున్నది. కాగా.. ఫిష్ ఫుడ్‌కోర్టుల ఏర్పాటుకు ఆయా ప్రాంతాల్లోని మత్స్య పారిశ్రామిక సహకార సంఘంలో సభ్యత్వం ఉన్న వారికే అవకాశం ఉంటుంది. మేకలు, గొర్రెలు, కోడి మాంసం ధరలు సామాన్యులు కొనలేని స్థాయికి చేరడంతో ఆరోగ్యకరమైన, బలవర్ధకమైన ఆహారంగా నిపుణులు సూచిస్తున్న చేపలు, రొయ్యలతో తయారు చేసిన ఆహారం ప్రజలకు అందుబాటులోకి రానుంది.
1,521 చెరువులు.. 8.14 కోట్ల చేపపిల్లలు..
ఈ ఆర్థిక సంవత్సరం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా 1,521 చెరువులు, ప్రాజెక్టులు, కుంటలలో 8.14 కోట్ల చేప పిల్లలను వదిలిపెట్టారు. ఇందులో నిర్మల్ జిల్లాలో 701 చెరువుల్లో 3.60 కోట్లు, ఆదిలాబాద్‌లో 231 చెరువుల్లో 1.16 కోట్లు, ఆసిఫాబాద్‌లో 264 చెరువుల్లో 1.35 కోట్లు, మంచిర్యాలలో 325 చెరువుల్లో 2 కోట్ల చేప పిల్లలను వదిలి పెట్టినట్లు అధికారులు తెలిపారు.
స్థల పరిశీలన పూర్తి..
ఆర్టీసీ బస్టాండ్లలో ఫిష్ ఫుడ్‌కోర్టును ఏర్పాటు చేయాలని జనవరిలో ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రయాణ ప్రాంగణంలో స్థలాన్ని ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదికలు పంపించాం. మత్స్య పారిశ్రామిక సహకార సంఘంలో సభ్యత్వం ఉన్న వారు, ఫిష్ ప్రై, కర్రీ, చట్నీ తదితర రంగాల్లో శిక్షణ పూర్తి చేసిన వారు మాత్రం ఫిష్ ఫుడ్‌కోర్టు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. దీని వల్ల మత్స్యకారులకు జీవనోపాధితోపాటు ఆర్థికంగా బలపడడానికి ఆస్కారం ఉంటుంది. – సాంబశివరావు, మత్స్యశాఖ అధికారి, ఆదిలాబాద్