Drinking water | తాంసి, జూలై 21: మండలంలోని పొన్నారి గ్రామం నీటి కొరతతో అల్లాడుతోంది. నాలుగు రోజులుగా తాగునీటి సరఫరా లేక గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎటువంటి స్పందన లేకపోవడంతో గ్రామస్తులు సోమవారం అంతర రాష్ట్ర రహదారిపై రాస్తారోకోకు దిగారు. ప్రత్యేకంగా ఎస్సీ కాలనీలో నివసిస్తున్న కుటుంబాలు నీరు లేక పరేషాన్ అవుతున్నాయని, ఆమాత్రం కనీస వసతి కల్పించకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణమంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రాస్తారోకో కారణంగా గంటకు పైగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అటుగా వెళుతున్న డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజా రెడ్డి అక్కడికి చేరుకుని గ్రామస్తుల నుంచి సమస్య వివరాలు తెలుసుకున్నారు. సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో మహిళలు నిరసన విరమించారు. ఈ విషయమై సంబంధిత గ్రామ పంచాయతీ కార్యదర్శిని వివరణ కోరగా పైప్ లీకేజీ సమస్య కారణంగా నీటి సరఫరా నిలిచిందని తెలిపారు. అత్యవసరంగా మరమ్మతులు చేపట్టి తాగునీటిని అందుబాటులోకి తీసుకొస్తామని వివరాలు వెల్లడించారు.