Field assistants | సారంగాపూర్, జూలై 2: పని చేయించి ప్రభుత్వానికి ఎంతో పేరు తీసుకువస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లను మాత్రం ప్రభుత్వం మరుస్తోంది. ఎంతో కష్టపడుతున్న పనికి తగ్గ వేతనాలు మాత్రం అందడం లేదు. చాలీచాలని జీవితాలతో జీవనం సాగిస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ల బాధలు అంతా ఇంతా కాదు. ‘ముందు నుయ్యి, వెనక గొయ్యి’ అన్నట్టుగా కక్కలేక మింగలేక ఎంతోమంది విధులు నిర్వహిస్తున్నారు. వచ్చే చిన్న జీతమైనా ప్రభుత్వం సమయానికి అందించకపోవడంతో కుటుంబాలను పోషించలేక ఎంతోమంది ఫీల్డ్ అసిస్టెంట్లు అప్పుల పాలవుతున్నారు. అలాంటి ఫీల్డ్ అసిస్టెంట్ల కష్టాలపై ‘నమస్తే తెలంగాణ’ అందిస్తున్న కథనం..
సారంగాపూర్ మండలంలో 32 గ్రామపంచాయతీలు ఉండగా 18 మంది మాత్రమే ఫీల్డ్ అసిస్టెంట్లు పనిచేస్తున్నారు. కొత్తగా ఏర్పడిన 14 గ్రామపంచాయతీల్లో ఫీల్డ్ అసిస్టెంట్లను ప్రభుత్వం నియమించకపోవడంతో పాత ఫీల్డ్ అసిస్టెంట్లు పనులు వెల్లదీస్తున్నారు. కాగా ఫీల్డ్ అసిస్టెంట్లు ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం దాకా ఏదో ఒక ప్రభుత్వ పనిలో నిమగ్నమై పని చేస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతీ సర్వేలో ఫీల్డ్ అసిస్టెంట్లను భాగం చేస్తూ పనిచేయిస్తూనే ఉన్నారు. ఒకవైపు ఉపాధి హామీ పని నడిపిస్తూ, మరోవైపు మిగతా పనులు చేస్తూ గ్రామాల్లో ఎన్నో ఇబ్బందులు పడుతున్న ఫీల్డ్ అసిస్టెంట్ల జీతాలు (మార్చి, ఏప్రిల్, మే, జూన్) నాలుగు నెలల నుండి ప్రభుత్వం ఇవ్వకుండా అలసత్వం వహిస్తుందని వారు ఆరోపిస్తున్నారు. చాలీ చాలని జీతాలతో బ్రతుకులు వెల్లదీస్తున్నా వారికి ఇచ్చే వేతనాలు సరైన సమయానికి అందకపోవడంతో అనేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని ఫీల్డ్ అసిస్టెంట్లు వాపోతున్నారు.
పనులు ఎక్కువ జీతం తక్కువ…
మాహత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలకు పనులు కల్పిస్తూ ప్రభుత్వానికి ఎంతో బాసటగా ఫీల్డ్ అసిస్టెంట్లు ఉంటున్నారు. ప్రతీ గ్రామంలో పల్లె ప్రకృతి వనాలు, ఇంకుడు గుంతల నిర్మాణం, స్మశాన వాటికలు, మరుగుదొడ్లు, క్రీడా ప్రాంగణాలు, నర్సరీలు, పండ్ల తోటల పెంపకం, సీసీ రోడ్లు, కూరగాయల తోటల నిర్మాణం, కూలీలకు పనులు కల్పించడం తదితర ఎన్నో పనుల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వానికి బాసటగా ఉండే ఫీల్డ్ అసిస్టెంట్ల కష్టాన్ని వాడుకొని ఇచ్చే బెనిఫిట్స్ ఇవ్వకుండా ప్రభుత్వం తత్సారం వహిస్తోందని పలువురు పేర్కొంటున్నారు. ఇంత కష్టపడుతున్నా తమను ప్రభుత్వాలు ఆదుకోవడం లేదని వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ డిమాండ్స్‌ను నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు.
డిమాండ్స్…
– 20 ఏళ్లుగా పనిచేస్తున్న పేస్కేల్లేదు
– ఫీల్డ్ అసిస్టెంట్లకు హెల్త్ కార్డులు ఇవ్వాలి
– ఫీల్డ్ అసిస్టెంట్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి
– కొత్త గ్రామపంచాయతీలో ఫీల్డ్ అసిస్టెంట్ లో నియమించాలి
– చనిపోయిన ఫీల్డ్ అసిస్టెంట్ల స్థానాల్లో వారి కుటుంబ లకు ఉద్యోగ భద్రత కల్పించాలి
అప్పుల పాలయ్యాం.. తమను ఆదుకోవాలి : సాయందర్, ఫీల్డ్ అసిస్టెంట్, జెవులి
ఉదయం లేచినప్పటి నుండి పనిలో నిమగ్నమై ఉంటాం. ప్రమాదాలు జరిగినా మాకు భరోసా లేదు. ఇప్పటికీ ఎంతోమంది ఫీల్డ్ అసిస్టెంట్లు ప్రమాదాల బారిన పడ్డారు. చాలామంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాం. అయినా ఏ ఒక్క రోజు కూడా విధుల్లోకి వెళ్లకుండా ఉండడం లేదు. ఇంత పని చేస్తున్నా సమయానికి వేతనాలు రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం.
జీతాలు లేవు.. ఇబ్బందిగా ఉంది : నాగయ్య, ఫీల్డ్ అసిస్టెంట్, జామ్
అహర్నిశలు కష్టపడుతున్న మాకు గుర్తింపు లేదు. చాలీచాలని జీతాలతో కాలం వెళ్లదీస్తున్నాం. ఉదయం లేవగానే గ్రామంలో తిరిగి ఎంతోమందికి ఉపాధి హామీ పథకం ద్వారా పనులు కల్పిస్తున్నాం. పారదర్శకంగా పనిచేస్తున్న మమ్మల్ని ప్రభుత్వం గుర్తించడం లేదు. మా డిమాండ్లను నెరవేర్చి మాకు గుర్తింపునివ్వండి.
కష్టం పెద్దది… జీతం చిన్నది : టీ సాయందర్, ఫీల్డ్ అసిస్టెంట్ల జిల్లా అధ్యక్షుడు, మలక్ చించోలి
ఉదయం లేవగానే పని కోసం వచ్చే కూలీలను కలుస్తాం. పని అయిపోగానే ఏదో ఒక సర్వే పేరుతో మమ్మల్ని ప్రభుత్వం ఉపయోగించుకుంటుంది. ఎంత కష్టపడినా రూ.9600 చాలీచాలని జీతమే. అది కూడా నెల నెల రావడం లేదు. నాలుగు నెలల నుండి జీతాలు రావట్లేదు. దీంతో కుటుంబాలను ఎలా పోషించుకోవాలి. ఫీల్డ్ అసిస్టెంట్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి. నిత్యవసర ధరలకు అనుకూలంగా పనికి తగ్గ వేతనం అందించాలి.