నిర్మల్ టౌన్, ఫిబ్రవరి 22 : పరిపాలనా సౌలభ్యం కోసం తెలంగాణ ప్రభుత్వం 2016లో ఉమ్మడి ఆదిలాబాద్‌ను నాలుగు జిల్లాలుగా విభజించింది. ఇందులో భాగంగా నిర్మల్‌ను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేసింది. దీంతో కొత్త జిల్లాలో పరిపాలనా సౌలభ్యం కోసం సమీకృత కలెక్టరేట్ భవనాల నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం మూడేళ్ల క్రితమే నిధులను విడుదల చేసింది. రూ.56 కోట్లతో నిర్మల్ పట్టణంలోని ఎల్లపెల్లి గ్రామ శివారులో 15 ఎకరాల స్థలంలో భవన నిర్మాణ పనులను దక్కించుకున్న ఎన్సీసీ కన్సల్టెంట్ పనులను వేగంగా చేపడుతున్నది. కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ చాంబర్‌తో పాటు క్యాంప్ ఆఫీస్, అదనపు కలెక్టర్ల చాంబర్లు, 36 డిపార్ట్మెంట్లకు సంబంధించిన అన్ని వసతులతో కూడిన భవనాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే బహుళ అంతస్తుల భవన నిర్మాణ పనులు 50శాతం పూర్తయింది. మూడు బ్లాక్‌లు, మూడు ఫ్లోర్లతో ఈ భవనాన్ని సువిశాలంగా నిర్మిస్తున్నారు. ప్రతిరోజూ 250 మంది కూలీలతో ఈ పనులు చేపడుతున్నారు. ఇప్పటికే మూడు స్లాబ్‌లు, 22 బ్లాక్ గదులు పూర్తి కాగా.. మిగతా పనులు శరవేగంగా సాగుతున్నాయి.
కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను ఇప్పటికే మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి మూడు రోజుల క్రితం పర్యవేక్షించారు. ఈ ఏప్రిల్ చివరి నాటికి అన్ని పనులు పూర్తి చేసేలా అధికారులపై చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ భవనంలో వివిధ డిపార్ట్మెంట్లకు అవసరమైన అన్ని రకాల అధునాతన సదుపాయాలతో దీన్ని నిర్మించడంతో కలెక్టరేట్ భవనం కొత్త పాలనకు శ్రీకారం చుట్టనున్నది. ఈ నేపథ్యంలో ఈ పనులు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. పనులను ఆర్అండ్బీ శాఖ అధికారులకు అప్పగించడంతో ఇద్దరు ఈఈలతో పాటు నలుగురు ఇంజినీర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, కొల్కత్తా, తమిళనాడుకు చెందిన కార్మికులు ఈ భవన నిర్మాణ పనుల్లో కూలీలుగా పనిచేస్తున్నారు. దీంతో పనులు చకచకా సాగుతున్నాయి. ఈ మూడు నెలల్లో పనులన్నీ పూర్తి చేసి కొత్త భవనం ప్రారంభానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్అండ్బీ అధికారులు తెలిపారు.
నిర్మల్ కలెక్టర్ సముదాయ భవనంలో పీవోపీ చేయడానికి పశ్చిమబెంగాల్ నుంచి 15 మంది కార్మికులం వచ్చాం. ఇప్పటికే భవనంలోని పలు అంతస్తుల్లో గదుల నిర్మాణం పూర్తయ్యింది. దీంతో పీవోపీ పనులు చేపడుతున్నాం. పనులు వేగంగా నిర్వహించేందుకు అవసరమైన కూలీలం ఇక్కడికి వచ్చాం. అదనంగా పని చేస్తున్నాం. మాకు ఇక్కడ చేతినిండా పని లభిస్తున్నది.
– పోసందిర్ భండార్, పశ్చిమ బెంగాల్
రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఆదేశాల మేరకు నూతన కలెక్టరేట్ సముదాయాల భవనాన్ని ఏప్రిల్ చివరి నాటికి పూర్తి చేస్తాం. రూ.56 కోట్లతో చేపట్టిన ఈ పనులు ఇప్పటికే 50 శాతం పూర్తి చేశాం. నాలుగు బ్లాక్‌లు, 36 డిపార్ట్మెంట్లకు అనుకూలంగా ఈ భవనాన్ని అన్ని హంగులతో నిర్మిస్తున్నాం. ప్రతి బ్లాక్‌లో హెడ్ కార్యాలయంతో పాటు కిందిస్థాయి ఉద్యోగులు పనిచేసే సెక్షన్లు, సమావేశ మందిరం, పార్క్, ఉద్యానవనం వంటివి ఏర్పాటు చేసి ప్రభుత్వానికి అప్పగిస్తాం.
– అశోక్ కుమార్, ఆర్అండ్బీ ఈఈ