కడెం, జనవరి 10: యాసంగి పంటల కోసం విడుదల చేస్తున్న కడెం ప్రాజెక్టు నీటిని రైతులు పొదుపుగా వాడుకోవాలని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ సూచించారు. యాసంగి పంటల సాగుకు మంగళవారం కడెం జలాశయం కుడి, ప్రధాన కాలువల ద్వారా నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. కడెం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు (7.603టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 694.550 అడుగుల (6.256టీఎంసీలు) వద్ద ఉందన్నారు. ఉన్న నీటిని డిస్ట్రిబ్యూటరీ-28 వరకు మాత్రమే విడుదల చేస్తామని పేర్కొన్నారు. 28వ డిస్ట్రిబ్యూటరీ వరకు రైతులు ఈ నీటిని ఆరుతడి పంటలకు వినియోగించుకోవాలని సూచించారు.
కుడి కాలువ ద్వారా కన్నాపూర్, కొండుకూర్, బెల్లాల్ రైతులకు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రధాన కాలువ ద్వారా ప్రస్తుతం 100 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తామని చెప్పారు. రైతుల డిమాండ్ మేరకు మరింత పెంచనున్నట్లు అధికారులు తెలిపారు. ఉన్న నీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని రైతులకు సూచించారు.