ఉట్నూర్, మే 8 : తమ భూముల్లో మొక్కలు నాటొద్దని పేర్కొంటూ బుధవారం ఉట్నూర్ ఫారెస్ట్ కార్యాలయం ఎదుట గంగాపూర్, దంతన్‌పల్లి, బీర్సాయిపేట్కు చెందిన రైతులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా జాడి లింగన్న, దుర్గం మల్లయ్య, గంగన్న, నర్సయ్య, లక్ష్మీ, విజయలు మాట్లాడుతూ.. గంగాపూర్ గ్రామానికి చెందిన 200 మంది రైతులు 550 ఎకరాలలో తాతల కాలం నుంచి వ్యవసాయం చేసుకుంటున్నామన్నారు. తమతోపాటు గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములకు ఆర్వోఎఫ్ఆర్ పట్టాలిచ్చారని పేర్కొన్నారు. నాన్ ట్రైబల్ అయిన తమకు పట్టాలివ్వక పోగా భూములు లాక్కునే ప్రయత్నాలు సాగుతున్నాయని ఆందోళన చెందారు. తాజాగా ఫారెస్ట్ అధికారులు తమ భూములలో మొక్కలు నాటే కార్యక్రమానికి పూనుకునేందుకు చూస్తున్నారన్నారు.
తమకు ఇవే భూములు ఆధారమని ఆవేదన వ్యక్తం చేశారు. 2012 సంవత్సరం వరకు తమకు అప్పటి ప్రభుత్వాలు పహానీలు ఇవ్వడంతో బ్యాంక్‌లో రుణాలు కూడా తీసుకున్నామన్నారు. ఏజెన్సీలోని నాన్ ట్రైబల్స్‌కు రైతులకు కనీసం రైతుబంధు, రైతుభీమా వంటి పథకాలు ఇవ్వకపోగా.. ఉన్న భూములే లాక్కునే పరిస్థితులు ఏర్పడ్డాయని ఆందోళన చేశారు. తమ భూములకు పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై ఎఫ్‌డీవో రేవంత్ చంద్రను వివరణ అడుగగా తాము ఎవరి భూములు లాక్కోవడం లేదని 2011 సంవత్సరంలో ఫారెస్ట్ ఉన్న భూములను చెట్లు నరికి వ్యవసాయం చేస్తున్న వ్యక్తుల భూములలో మళ్లీ మొక్కలు నాటే ప్రయత్నం చేస్తున్నామన్నారు. అవి ఫారెస్ట్ భూములను వాటిలో అడవిని పెంపొందించేందుకు కృషి చేస్తామన్నారు.