భైంసా, డిసెంబర్ 31 : ముథోల్ నియోజకవర్గంలోని కొందరు రైతులకు సాంకేతిక సమస్యల వల్ల రైతు బంధు రావడం లేదని, సమస్య పరిష్కరించాలని చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ను ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి కోరారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్లోని తన కార్యాలయంలో కలిసి, సమస్య విన్నవించారు. ప్రభుత్వం చెరువులు, కాలువలు, రోడ్ల అభివృద్ధికి కొంత భూ సేకరణ చేయగా, సంబంధిత పట్టాలో మిగిలిన భూమికి రైతుబంధు రావడం లేదని తెలిపారు.
దీంతో రైతులు పంట పెట్టుబడి సాయం కోసం ఇబ్బంది పడుతున్నారని వివరించారు. కలెక్టర్, వ్యవసాయాధికారులు సంబంధిత నివేదిక ప్రభుత్వానికి పంపినట్లు తెలిపారు. ఈ మేరకు స్పందించిన చీఫ్ సెక్రటరీ సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని ఎమ్మెల్యే తెలిపారు.