ఇచ్చోడ, మే 16 : ఇచ్చోడ, సిరికొండ మండలాల్లో శుక్రవారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. ఇచ్చోడ, సిరికొండ మండలాల యార్డుల్లో జొన్నలు విక్రయించడానికి వచ్చిన రైతులు ఇబ్బంది పడ్డారు. టార్పలిన్లు కప్పి ధాన్యం తడసిపోకుండా కాపాడుకున్నారు. సిరికొండలో శాశ్వత మార్కెట్ యార్డు ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు. ఈదురుగాలులతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
తాంసి(భీంపూర్), మే 16 : భీంపూర్ మండలంలోని నిపాని, పిప్పల్కోటి, తదితర గ్రామాల్లో శుక్రవారం సాయంత్రం మోస్తారు వర్షం కురిసింది. అక్కడక్కడ జొన్నలను చేల నుంచి తీసుకెళ్లేందుకు రైతులు ఇబ్బంది పడ్డారు.
ఇంద్రవెల్లి, మే 16 : మండలకేంద్రంతోపాటు గ్రామాల్లో శుక్రవారం రాత్రి 7గంటల నుంచి భారీ వర్షం మొదలైంది. పలు చోట్ల విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగింది. ఉక్కపోతతో ఇబ్బంది పడ్డ ప్రజలు వర్షంతో ఉపశమనం పొందారు.
తాంసి, మే 16 : మండల కేంద్రంతోపాటు పొన్నారి, హస్నాపూర్, వడ్డాడి, కప్పర్ల, గిరిగామ గ్రామాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. తాంసి మండల కేంద్రం సమీపంలోని పాఠశాల వెనకాల పంట చేనులో రావి చెట్టుపై పిడుగు పడింది. పిడుగు ధాటికి రావి చెట్టు దగ్ధమైంది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పిందని గ్రామస్తులు తెలిపారు.