వానకాలం పారంభమై నెల రోజులైనా జిల్లాలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో రైతన్నలు కలత చెందుతున్నారు. ఇప్పటికే పొలాలను దున్ని, విత్తనాలు వేసి వర్షాల కోసం ఎదురుచూస్తున్న అన్నదాతలకు నిరాశే ఎదురవుతు న్నది. అడపా దడపా కురుస్తున్న మోస్తారు వర్షాలు భూమిని తడపడానికే తప్ప, జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులు, చెరువుల్లో చేరడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా నిర్మల్ జిల్లాలోని కడెం, స్వర్ణ, గడ్డెన్నవాగుతో పాటు సదర్మాట్ ఆనకట్ట కింద దాదాపు 1.20 లక్షల ఎకరాల ఆయకట్టు పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది.

నిర్మల్, జూలై 10(నమస్తే తెలంగాణ) : నిర్మల్ జిల్లాలో కొన్ని రోజులుగా వర్షాలు ముఖం చాటేయడంతో జిల్లాలోనే అతిపెద్ద ఆయకట్టు కలిగిన కడెం ప్రాజెక్టు పరిస్థితి ప్రస్తుతం దయనీయంగా మారింది. ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 3.495 టీఎంసీలు కాగా, ప్రస్తుతం ప్రాజెక్టులో కేవలం 0.461 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉంది. ఈ ప్రాజెక్టు పరిధిలో దాదాపు 68వేల ఎకరాల ఆయకట్టు భూములున్నాయి. సాగుకు సరిపడా నీటి నిల్వలు లేకపోవడంతో రాబోయే రోజుల్లో భారీ వర్షాలు కురిస్తేనే ఆయకట్టు భూములకు సాగునీరందే అవకాశం ఉంది.
ఎగువ ప్రాంతం నుంచి ఇన్ఫ్లో పెరిగి ప్రాజెక్టు నిండితే తప్ప ఆయకట్టుకు నీటి విడుదలపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేమని నీటిపారుదల శాఖ అధికారులు చేతులెత్తేస్తున్నారు. ఇదిలా ఉంటే జిల్లాలోని ఖానాపూర్, కడెం మండలాలకు జీవనాధారమైన సదర్మాట్ బ్యారేజీలోనూ ఇదే పరిస్థితి నెలకొన్నది. బ్యారేజీ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 1.58 టీఎంసీలు, ప్రస్తుతం అందులో కేవలం 0.5 టీఎంసీల నీరు మాత్రమే ఉన్నది. సదర్మాట్ పాత ఆనకట్ట పరిధిలో ఖానాపూర్, కడెం మండలాల్లో 13,120 ఎకరాలు, జగిత్యాల జిల్లాలో మరో 5 వేల ఎకరాల ఆయకట్టు ఉన్నది. బ్యారేజీలో పూర్తి స్థాయిలో నీటి నిల్వలు ఉంటే తప్ప సాగునీరు విడుదల చేసే పరిస్థితి కనిపించడం లేదు.
మహారాష్ట్రలో కురిస్తేనే ప్రాజెక్టులకు వరద
జిల్లాలోని మరో రెండు ప్రధాన ప్రాజెక్టులైన స్వర్ణ, గడ్డెన్న వాగు ప్రాజెక్టులు మహారాష్ట్ర సరిహద్దులో ఉన్నాయి. ఎగువ మహారాష్ట్రలో భారీ వర్షాలు కురిస్తేనే జిల్లాలోని ఈ రెండు ప్రాజెక్టులకు వరద వచ్చే అవకాశం ఉన్నది. స్వర్ణ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 1.037 టీఎంసీలు కాగా, ప్రస్తుతం ప్రాజెక్టులో కేవలం 0.164 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉంది. ఈ ప్రాజెక్టు పరిధిలో 8,945 ఎకరాల ఆయకట్టు భూములున్నాయి. ఆయా భూములకు సాగునీరు విడుదల చేయాలంటే ప్రాజెక్టులో కనీసం 0.400 టీఎంసీల నీరు ఉండాలని ఇరిగేషన్ శాఖ అధికారులు చెబుతున్నారు. గడ్డెన్నవాగు ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 1.830టీఎంసీలు కాగా, ప్రస్తుతం ప్రాజెక్టులో కేవలం 0.540 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉంది. ఈ ప్రాజెక్టు పరిధిలో 13,950 ఎకరాల ఆయకట్టు భూములు ఉన్నాయి. గడ్డెన్నవాగు ప్రాజెక్టులో గతేడాది ఇదే రోజున 0.512 టీఎంసీల నీరుండగా, ప్రస్తుత పరిస్థితి దాదాపు అంతే (0.540) ఉంది. ఎగువ మహారాష్ట్రలో భారీ వర్షాలు కురిస్తేనే ప్రాజెక్టు కింది భూములకు సాగునీరు విడుదల చేసే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

సరస్వతీ కాలువ కింద తప్పని ఎదురుచూపులు
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ) పరిధిలోని సరస్వతీ కాల్వ కింద నిర్మల్ జిల్లాలో దాదాపు 37వేల ఎకరాలు సాగవుతాయి. జిల్లాలోని నిర్మల్, సోన్, లక్ష్మణచాంద, మామడ, ఖానాపూర్, కడెం మండలాల్లోని రైతులకు ఇదే ప్రధాన సాగునీటి వనరు. సాధారణంగా ప్రతి సంవత్సరం జూలై నెలలోనే ఈ కాల్వకు సాగు నీటిని విడుదల చేస్తుంటారు. కాని ప్రస్తుతం శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో కేవలం 15.274 టీఎంసీల నీటి మట్టం మాత్రమే ఉంది. ప్రాజెక్టు ఎగువన క్యాచ్మెంట్ ఏరియాలో భారీ వర్షాలు కురిసి, ఎస్సారెస్పీలోకి కనీసం 45టీఎంసీల నీరు వస్తేనే సాగునీరు ఇవ్వడానికి వీలవుతుందని అధికారులు చెబుతున్నారు.
గతేడాది కూడా వర్షాభావ పరిస్థితుల కారణంగా ఆగస్టు నెలలోనే నీటిని విడుదల చేశామని, ఈసారి కూడా భారీ వర్షాలు కురిసే వరకు రైతులు వేచి చూడాల్సిందేనంటున్నారు. ప్రాజెక్టుల పరిస్థితి ఈ విధంగా ఉంటే, జిల్లా వ్యాప్తంగా ఉన్న దాదాపు 500 చెరువుల్లో సైతం ఈ సీజన్లో చుక్క నీరు చేరలేదు. దీంతో చెరువులన్నీ నీరు లేక బోసిపోయి కనిపిస్తున్నాయి. ఆయా చెరువుల కింద వరిపంటను సాగు చేసేందుకు రైతులు ఇప్పటికే దుక్కిదున్ని పొలాలను సిద్ధం చేశారు. ఇలా జిల్లాలోని ప్రాజెక్టులు, చెరువులు వెలవెలబోతుండడంతో అన్నదాతలు ఆకాశం వైపు దిక్కులు చూస్తున్నారు. మరో 15 రోజుల వరకు ఆశించిన వర్షాలు కురియకపోతే అదును దాటిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
సాగు లక్ష్యం 4.10 లక్షల ఎకరాలు
కాగా ఈ వానకాలం సీజన్లో జిల్లా వ్యాప్తంగా రూ.4.10 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. ఇందులో ఇప్పటివరకూ దాదాపు 2.50లక్షల ఎకరాల్లో ఆరుతడి పంటలైన పత్తి, సోయా, మక్క, ఇతర పప్పుదినుసుల పంటలను వేశారని చెబుతున్నారు. జిల్లాలో వరిపంట సాగు లక్ష్యం 1.20లక్షల ఎకరాలు కాగా, ఈ సారి వర్షాలు ఆలస్యం కావడం, జలాశయాల్లోకి వరద నీరు చేరకపోవడంతో ఇప్పటి వరకు కేవలం 500 ఎకరాల్లో మాత్రమే వరినాట్లు పూర్తయ్యాయి. బోరుబావుల కింద వరి సాగుకు ఎలాంటి ఇబ్బంది లేకున్నప్పటికీ, చెరువులు, ప్రాజెక్టుల కింద మాత్రం ఈసారి వరిసాగు మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అధికారులు సైతం ఈ నెలాఖరు నాటికి భారీ వర్షాలు కురిస్తేనే వరినాట్లు వేయాలని రైతులకు సూచిస్తున్నారు.