జన్నారం, జూన్ 22 : జన్నారం మండలం కామన్పల్లి, అలీనగర్, దేవునిగూడ, మందపల్లి, తిమ్మాపూర్, పొనకల్ తదితర గ్రామాల మీదుగా వెళ్లే కడెం ప్రధాన కాలువలు అధ్వానంగా మారాయి. పెద్ద పెద్ద బుంగలు పడి.. సిమెంట్ లైనింగ్ దెబ్బతిని.. పిచ్చిమొక్కలు పెరిగి.. చెత్తాచెదారంతో నిండి పంటలకు నీరందించలేని దుస్థితికి చేరాయి.
ఈ యేడాది జన్నారం మండలంలోని 19వ-డీ, 22వ డిస్ట్రీబ్యూటరీ కాలువలపై ఆధారపడి 17,700 ఎకరాల్లో వరి వేస్తున్నట్లు అంచనా. ప్రస్తుతం సాగు పనులు ఊపందుకుంటుండగా, ఇప్పటి వరకు అధికారులు కాలువల మరమ్మతులపై దృష్టి సారించకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇకనైనా స్పందిస్తారో.. లేదో చూడాలి మరి..