ముథోల్, మే, 27 : కొనుగోలు కేంద్రాల్లో వ డ్లు తూకం వేసి 20 రోజులైనా మిల్లులు, గోదాములకు తరలించడం లేదని, ఓ వైపు వర్షాలు పడుతున్నాయని ఇంకెప్పుడు తరలిస్తారని అధికారులపై రైతన్నలు కన్నెర్రజేశారు. కొనుగోలు కేంద్రాలకు లారీలు పంపకపోవడాన్ని నిరసిస్తూ బుధవారం తరోడాలోని భైం సా- బాసర రహదారిపై రాస్తారోకో చేశారు. పలువురు రైతులు రోడ్డుపై పడుకొని నిరసన తెలిపారు. ముథోల్ మండలంలోని తరోడా, చించాల గ్రామాల్లో వరి కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేసిన దొడ్డు రకం వడ్లను తరలించడంలో ప్రభుత్వం జాప్యం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
తరోడా కొనుగోలు కేంద్రంలో 3 వేలు, చించాల సెంటర్లో 4 వేల బస్తాలు కొనుగోలు చేసి 20 రోజులైందని, లారీలు లేక తరలించడం లేదన్నారు. వర్షాలు పడుతుండడంతో తూకం వేసిన వడ్ల బస్తాలను కాపాడేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మిల్లర్లను అడిగితే సన్నరకం వడ్లను తీసుకుంటున్నట్లు చెబుతున్నారని రైతులు వాపోయారు. తక్షణమే లారీలు తెప్పించి వడ్లను తీసుకవెళ్లాలని డిమాండ్ చేశారు. అధికారులు స్పష్టమైన హమీ ఇచ్చే వరకు రోడ్డుపై నుంచి కదిలేది లేదని భీష్మించుక్కూర్చున్నారు. దీంతో తహసీల్దార్ శ్రీలత ఘటనా స్థలానికి చేరుకొని రైతులతో మాట్లాడారు. చించాల, తరోడా గ్రామాలకు లారీలు పంపిస్తామని హమీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. దీంతో పోలీసులు వచ్చి ట్రాఫిక్‌ను క్లియర్ చేసి వాహనాలను పంపించారు.