మంచిర్యాల, ఆగస్టు27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నుంచి మంచిర్యాల జిల్లా కుర్మపల్లి వరకు నిర్మిస్తున్న ఎన్‌హెచ్-63 అలైన్మెంట్ మూడోసారి కూడా మారింది. ఫిబ్రవరిలో నోటిఫికేషన్ విడుదల చేసిన అధికారులు.. తాజాగా భూములు కోల్పోయే రైతులకు సైతం నోటీసులివ్వడంపై ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ఎన్‌హెచ్-63 అలైన్మెంట్ ఎవరికోసం మార్చారంటూ అన్నదాతలు మండిపడుతున్నారు.
గతంలో ఎల్లంపల్లి ప్రాజెక్టులో భూములు కోల్పోయామని, ఉన్న కొద్దిపాటి భూమి కూడా హైవేలో పోతే ఇక బతికేదెట్లా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్హెచ్ఏఐ చట్టప్రకారం నడుచుకోకుండా, హడావుడిగా నోటీసులిచ్చి భూములు లాగేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అలైన్‌మెంట్‌ను రద్దు చేసి, రైతులకు ఇచ్చిన నోటీసులు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ మేరకు మంగళవారం మంచిర్యాల ఆర్డీవో కార్యాలయానికి వచ్చి అధికారులిచ్చిన నోటీసులను తగలబెట్టి నిరసన తెలిపారు. ఆర్డీవో అందుబాటులో లేకపోవడంతో ఏవోకు వినతిపత్రం సమర్పించారు. అసలు హైవే కోసం మూడు సార్లు అలైన్మెంట్ మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందని.. రెండో అలైన్మెంట్ బాగుందని నిపుణులు చెప్పినా… మూడోసారి ఎవరికోసం మార్చారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
బ్రౌన్ ఫీల్డే బాగుండేనా.. తప్పుడు రిపోర్ట్ ఇచ్చారా..
నేషనల్ హైవే-63 నిజమాబాద్ జిల్లా బోధన్ నుం చి ఛత్తీస్‌గఢ్‌లోని జగ్దల్పూర్ దాకా విస్తరించి ఉం ది. ఈ హైవేను ఆర్మూర్ నుంచి మంచిర్యాల వరకు ఫోర్‌లేన్‌గా మార్చాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు రూ.5354.12 కోట్ల అంచనాతో 160 కిలోమీటర్ల పొడవునా పొలాల మీదుగా గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణానికి మొదటి అలైన్మెంట్ రూపొందించారు. లక్షెట్టిపేట శివారులోని పొలాలు, అటవీ ప్రాంతం మీదుగా ఇది వెళ్తుంది. దీనికి స్థానిక రైతులు అంగీకారం తెలపకపోవడం కొంత మంది భూస్వాములు, రియల్టర్లు ఫైరవీలు చేసి ఒత్తిడి తీసుకురావడంతో దాన్ని రద్దు చేశారనే ఆరోపణలున్నాయి.
ఇక రెండోసారి ప్రస్తుతమున్న రోడ్డునే బ్రౌన్‌ఫీల్డ్‌గా మార్చడానికి అలైన్మెంట్ తయారు చేసి 2023లో నోటిఫికేషన్ ఇచ్చారు. రోడ్డుపక్కన ఉన్న ఇండ్లు, భూములు కోల్పోతున్న వారు వ్యతిరేకించినా సర్వే చేశారు. దీంతో చాలా మంది హైవే తప్పదని నిర్ణయానికి వచ్చి రోడ్డు పక్కన భూముల్లో కొత్త షెడ్లు వేసుకొని, బోర్లు నిర్మించుకున్నారు. నిర్మాణాలుంటే ఎక్కువ పరిహారం వస్తుందని భావించారు. నిపుణులు సైతం బ్రౌన్ ఫీల్డ్ చేస్తే తక్కువ నష్టం ఉంటుందని చెప్పారు.
కానీ లక్షెట్టిపేటలోని కొందరు భూములు, ఇండ్లు కాపాడుకోవడం కోసం నానా యాగీ చేశారు. ఫోర్‌లేన్ కోసం 150 ఫీట్లు(45 మీటర్లు) అవసరం, లక్షెట్టిపేట మున్సిపల్ పరిధిలోని రోడ్డు 132 ఫీట్లు (40 మీటర్ల) వెడల్పు ఉంది. మరో ఐదు మీటర్లు పెంచుకుంటే అయిపోయేదానికి ప్రస్తుతమున్న రోడ్డు 100 మీటర్లే ఉందంటూ తప్పుడు రిపోర్టు ఇచ్చారు. ఫోర్‌లేన్ కోసం భారీగా భూ సేకరణ చేయాల్సి వస్తుందని తప్పుడు రిపోర్ట్ ఇచ్చి అధికారులను బోల్తా కొట్టించారు. ఎవరికీ నష్టం కలగకుండా లక్షెట్టిపేట శివారు నుంచి బైపాస్ తీయాలని మున్సిపల్లో తీర్మానం చేశారు.
ఓ విద్యాసంస్థకు అనుకూలంగా మూడో అలైన్మెంట్..!
రెండు అలైన్మెంట్ల అనంతరం ఎన్హెచ్ఏఐ అధికారులు లక్షెట్టిపేట మండలం మోదెల నుంచి కుర్మపల్లికి మూడో అలైన్మెంట్ రూపొందించారు. గోదావరి తీరం వెంట 35 కిలోమీటర్లు నిర్మించే ఈ రోడ్డు కోసం జిల్లాలోని 17 గ్రామాల్లో 1433.75 ఎకరాల భూ సేకరణకు సిద్ధమయ్యారు. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం నుంచి గోదావరి మీదుగా లక్షెట్టిపేట శివారుగా ముల్కల్ల దాకా మూడో అలైన్మెంట్ సిద్ధం చేశారు.
రెండు అలైన్టెంట్ బ్రౌన్‌ఫీల్డ్ రద్దు కావడం, లక్షెట్టిపేట మోదెల శివారు నుంచి బైపాస్ తీయాలని మున్సిపల్ తీర్మానం చేయడం.. లక్షెట్టిపేట సమీపంలో భూములు కొనుగోలు చేసిన ఓ మైనార్టీ విద్యాసంస్థకు ఇష్టం లేదని తెలిసింది. దీంతో వాళ్లు ఢిల్లీ స్థాయిలో ఫైరవీలు చేయడంతో బైపాస్ మీదుగా వెళ్లాల్సిన హైవే కాస్తా పూర్తిగా గ్రీన్‌ఫీల్డ్‌గా మారినట్లు తెలిసింది. దీనికి ఈ ప్రాంతంలో ఉండే బడా భూస్వాములు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు వంత పాడడంతో సీన్ పూర్తిగా రైతుల పీకలమీదికి వచ్చేసింది. ఈ విద్యాంస్థ సంస్థకు సన్నిహితంగా ఉండే ఎన్హెచ్ఏఐ హైదరాబాద్ రీజినల్ ఆఫీసులో పని చేసే ఓ అధికారి సహకరించినట్లు తెలుస్తుంది. ఆయన ఢిల్లీకి బదిలీ కావడంతో పని మరింత సులభమైనట్లు సమచారం.
సుప్రీం మార్గదర్శకాలను తొక్కేశారు.. కోర్టుకు వెళ్తే బ్రేకులు తప్పవు..
హైవేలు, ప్రాజెక్టుల కోసం ఓ సారి భూములు కోల్పోయిన వారి నుంచి రెండోసారి భూ సేకరణ చేయడానికి వీల్లేదు. ఈ మేరకు సుప్రీం కోర్టు నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. కానీ మూడో అలైన్మెంట్ విషయంలో ఎన్హెచ్ఏఐ అధికారులు దీనిని పరిగణలోకి తీసుకోలేదు. ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద హజీపూర్, లక్షెట్టిపేట మండలాల్లో వేల ఎకరాల సాగు భూములు తీసుకున్నారు. దాదాపు 9 గ్రామాల ప్రజలు నిర్వాసితులుగా మారారు.
వారికి వేరే దగ్గర భూములు, ఇండ్లు పరిహారంగా అందజేశారు. ఇప్పుడు మూడో అలైన్మెంట్లో మళ్లీ అదే గ్రామాల రైతులు భూములు కోల్పోతున్నారు. 2004లో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భూములు ఇచ్చామని, ఇప్పుడు మిగిలిన కొద్ది పాటి భూమిని నేషనల్ హైవేకు ఇస్తే తాము రోడ్డుమీదకు రావాల్సిందేనంటూ వాపోతున్నారు. అధికారులు అలైన్మెంట్ మార్చకపోతే కోర్టుకు వెళ్లి తేల్చుకుంటామని చెబుతున్నారు. బ్రౌన్ ఫీల్డ్‌తో ఎవరికి ఇబ్బంది లేదని, కొందరి కోసం రైతులను ఇబ్బందులు పెట్టొద్దని వేడుకుంటున్నారు.
ఉన్న ఎకరం కూడా కావాలంటూ నోటీసులిచ్చిన్రు
ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కోసం 2004లో మా భూమి తీసుకున్నరు. అది పోంగ ఎకరం మిగిలింది. దానిమీదే నేను, నా కొడుకు బతుకుతున్నం. ఇప్పుడు హైవే కోసం ఆ భూమి క ఊడా కావాలంటూ నోటీసులిచ్చిన్రు. ఉన్న ఎకరంపోతే నేను, నా కొడుకు బతికేదెట్లా. ఇదెక్కడి న్యాయం. నా పాణం పోయినా మంచిదే భూమి ఇచ్చేది లేదు.
– చల్ల సత్తవా, సూరారం
పోయిన భూమికే రూపాయి రాలే
మాకు ముల్కలలో భూమి ఉంది. మంచి ర్యాల పంప్ హౌస్ కోసం గతంలో 17 గుంట ల భూమిని తీసుకున్నరు. గా భూమి కి ఇప్పటి దాకా ఒక్క రూపాయి కూడా ఇయ్యలే. ఇప్పుడు మిగిలిన ఎకరం భూమి మధ్యలో నుంచి హైవే వేస్తున్నారు. ఎంతో విలువ చేసే భూమి పోతుందంటే బాధేస్తుం ది. న్యాయం జరిగే దాకా పోరాటం చేస్తా. మా కుటుంబాన్ని రోడ్డు పాలు చేయొద్దు.
– అల్లి లక్ష్మి, వేంపల్లి