ఆదిలాబాద్, మే 21(నమస్తే తెలంగాణ) : రైతులు పండించిన ధాన్యానికి రూ.500ల బోనస్ చెల్లించి కొనుగోలు చేస్తామని ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇచ్చిన హామీని అమలు చేయకపోవడంపై రైతన్నలు మండిపడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్ ప్రాంతంతోపాటు నిర్మల్ జిల్లాల్లో వానకాలం, యాసంగిలో అధికంగా దొడ్డు వడ్లు సాగవుతాయి. కేసీఆర్ సర్కారు రైతులు పండించిన పంట ఉత్పత్తులను ప్రభుత్వం కొనుగోలు చేసింది. కరోనా సమయంలో కూడా రైతులు నష్టపోకుండా గ్రామాల్లో కాంటాలను ఏర్పాటు చేసి ధాన్యాన్ని సేకరించింది. డబ్బులను కూడా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రేవంత్రెడ్డి ధాన్యానికి రూ.500లు చెల్లించి కొనుగోలు చేస్తామని ప్రకటించడంతో రైతులు సంతోషించారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పడు రైతులను పక్కదారి పట్టిస్తున్నది. కేవలం సన్నరకం వడ్లకే రూ.500 బోనస్ వచ్చే వానకాలం నుంచి చెల్లిస్తామని ప్రకటించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దొడ్లు వడ్లకు రూ.2,100 మద్దతు ధర ఉండగా.. సన్న వడ్లకు రూ.3వేల నుంచి రూ.3,500 ధర పలుకుతున్నది. దీంతో రైతులు సన్న వడ్లను ప్రభుత్వ కేంద్రాల్లో విక్రయించే పరిస్థితి ఉండదు. ధాన్యానికి బోనస్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అన్ని రకాల వడ్లకు బోనస్ చెల్లించాలి..
కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల్లో భాగంగా రైతులు పండించిన ధాన్యానికి రూ.500 బోనస్ చెల్లించి కొనుగోలు చేస్తామని ప్రకటించింది. ఇప్పడు సన్నవడ్లకే బోనస్ ఇస్తాం అంటూ మాటమార్చే ప్రయత్నం చేస్తున్నది. ఎన్నికలప్పుడు ఒక మాట, ఆ తర్వాత ఒక మాట మాట్లాడడం రైతులను మోసం చేయడమే. రెండు సీజన్లలో వరి పండిస్తాం. ఎక్కువగా దొడ్లు వడ్లను సాగు చేస్తాం. సన్న వడ్లను తినడానికి మాత్రమే పండిస్తాం. సన్న వడ్లకు బయట మంచి ధర ఉంది. రూ.3 వేలకు పైగా చెల్లించి వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. దొడ్డు వడ్లకు రూ.2100 మద్దతు ధర ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం దొడ్డు వడ్లను కొనుగోలు చేయకపోతే రైతుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది.
– వెంకట్రెడ్డి, రైతు, కజ్జర్ల, తలమడుగు