సీసీసీ నస్పూర్, ఏప్రిల్ 16 : అన్నదాతలకు ‘భరో సా’ ఇవ్వడంలో కాంగ్రెస్ మీనమేషాలు లెక్కిస్తోంది. అధికారంలోకి రాగానే ఎకరాకు రూ.15 వేల చొప్పు న ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం, ఆపై మాటతప్పి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నది. ఇప్పటికే మూడు విడుతలు ఎగ్గొట్టగా, 2025-26 యాసంగికి సంబంధించిన నిధులను వాయిదాల పద్ధతిలో విడుదల చేయాలని నిర్ణయించింది. ముందుగా ఎకరమున్న వారికి రూ. 6 వేలు జమ చేస్తామని చెప్పగా, వారికీ పూర్తి స్థాయిలో చెల్లించకుండా మొండి చేయి చూపింది.
ఇక గత నెల 22న సిద్దిపేట జిల్లా నర్మెట్టలో జరిగిన బహిరంగ సభలో ఐదెకరాల్లోపున్న వారికి 20 (ఏప్రిల్-15) రోజుల్లోగా రెండో విడుత.. ఆపై భూమి ఉన్న వారికి మూడో విడుత నిధులు జమ చేస్తామని ప్రకటించిన సీఎం రేవంత్, గడువు ముగిసినా ఊసెత్తకపోవడం ఆందోళనకు గురి చేస్తున్నది. కేసీఆర్ సర్కారులో యాసంగి, వానకాలం సీజన్ ప్రారంభంలోనే రైతుబంధు నిధులు జమ అయ్యేవని, ప్రస్తుత ప్రభుత్వం అరిగోస పెట్టుకుంటున్నదని కర్షకలోకం కన్నెర్ర చేస్తున్నది.
ముగుస్తున్న యాసంగి సీజన్..
రాష్ట్రంలో యాసంగి సీజన్ ముగిసి, వానకాలం సీజ న్ సమీపిస్తున్నా రైత భరోసాపై ప్రభుత్వం స్పందించడం లేదు. ప్రభుత్వం ప్రకటించి 20 రోజుల గడువు పూర్తయినా ఇప్పటికీ నిధులు రైతుల ఖాతాల్లో జమ కాలేదు. అసలు రెండో విడుత నిధులు వస్తాయో.. లేదోనన్నా ఆందోళనలో అన్నదాతలు ఉన్నారు. యా సంగికి పంటలకు ముందు వేయాల్సిన రైతు భరోసా నిధులను ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. రైతు భ రోసాపై రోజుకో తేదీని ప్రకటిస్తూ కాలయాపన చేస్తూ వచ్చింది.
పంటలు వేసిన తర్వాత చాలా రోజులకు మూడు విడుతల్లో రైతు భరోసా వేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. దాదాపు యాసంగి పంట చేతికొచ్చే సమయానికి మొక్కుబడిగా మొదటి విడుత నిధులను విడుదల చేసింది. రెండో విడుతకు సంబంధించి 20 రోజుల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పటికీ నిధులు విడుదల చేయడం లేదు. రైతు భరోసా విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు చూస్తే రెండు, మూడు విడుతలకు సంబంధించిన నిధులు విడుదల చేస్తుందో.. లేదోనన్నా సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
రెండో విడుత భరోసాపై అనుమానాలు..
మంచిర్యాల జిల్లాలో దాదాపు 1.70లక్షల మంది రైతులు ఉండగా, 1,51,416 మంది రైతులకు రూ.76.62 కోట్లు రైతు భరోసా నిధులు జమ అయ్యాయని, వివిధ కారణాలతో మిగిలి వారికి ఖాతాల్లో భరోసా నిధులు జమ కాలేదని చెబుతున్నారు. ఈ నెల 15తో రెండో విడుత రైతుభరోసా నిధుల విడుదల గడువు ముగిసినా, దీనిపై ప్రభుత్వం నోరుమొదపకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే అకాల వర్షాలతో పంటలు దెబ్బతిని రైతులు ఆర్థికంగా నష్టపోయారు. మరోవైపు ఎరువులు, విత్తనాలు, ఇతరాత్ర ఖర్చులు పెరిగిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో రైతు భరోసా నిధులు వస్తే కాస్త.. ఉపశమనంగా ఉంటుందని భావించిన అన్నదాతలు.. ప్రభుత్వ అవలంభిస్తున్న సాగదీత ధోరణిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రెండు, మూడు విడుతలకు సంబంధించిన భరోసా నిధులు ఒకేసారి వేయాలని రైతులు కోరుతున్నారు.
సమీపిస్తున్న వానకాలం పంట..
మే నెల అయిపోయిందంటే జూన్ నుంచి వానకాలం పంటలకు రైతులు సన్నద్ధం కానున్నారు. మళ్లీ వానాకాలం పంటకు రైతు భరోసా ఇవ్వాల్సి ఉంటుంది. ప్రభుత్వం కొత్తగా విడుతల వారీగా రైతు భరోసా విధానాన్ని అమలు చేయడం.. యాసంగి పంటకు సంబంధించిన రైతు భరోసా ఇంకా పూర్తి కాలేదు. ఎకరం భూమి ఉన్న రైతుల ఖాతాల్లో గత నెల 22న మొదటి విడుత రైత భరోసా నిధులు జమ చేసిన ప్రభుత్వం, 2 నుంచి 5 ఎకరాల లోపు వారికి 20 రోజుల్లో రెండో విడుత, ఆపైన ఉన్న భూమి వారికి మరో 20 రోజుల్లో మూడో విడుత నిధులు జమ చేస్తామని ప్రకటించింది. ఇప్పటికీ యాసంగి రైతు భరోసా పూర్తి స్థాయిలో జమ కాలేదు. ఇక వచ్చే వానాకాలం సీజన్‌కు సంబంధించిన రైతు భరోసా జూన్‌లో విడుదల చేయాల్సి ఉంటుంది. యాసంగి భరోసాకే దిక్కులేదు.. వానకాలం రైతు భరోసా వస్తుందో లేదోనని రైతుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విడుతలకు స్వస్తిపలికి ఒకేసారి రైతు భరోసా డబ్బులు పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
రెండో విడుత డబ్బులు విడుదల చేయాలి
రెండో విడుత రైతు భరోసా నిధులు ఈ నెల 15లోగా వేస్తామని చెప్పిన రేవంత్‌రెడ్డి సర్కారు చెప్పింది. కానీ ఇప్పటికీ మాట నిలబెట్టుకోలేక పోయింది. యాసంగి పంటలు కోతలకు వచ్చాయి. ఒకే ఎకరానికి డబ్బలు వేశారు. ఇంకా రెండు, మూడు విడుతలకు సంబంధించిన డబ్బులు వేయకుండా నాన్చుతున్నరు. అదిగో వచ్చే.. ఇదిగో వచ్చే అనే ఆర్భాటమే తప్ప చేసిందేమీ లేదు. నాకు నస్పూర్ గ్రామంలో గోదావరి నది సమీపంలో 2 ఎకరాలు భూమి ఉంది. కేసీఆర్ ప్రభుత్వంలో పంటలకు ముందే ఒకేసారి రైతుబంధు డబ్బులు పడేవి. అవి ఎరువులు, విత్తనాలు, పొలం దున్నడం, నాట్ల ఖర్చుకు వాడుకునేటోళ్లం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అసలు రైతు భరోసా డబ్బులు వస్తాయో.. రావోనన్న అనుమానపడాల్సి వస్తున్నది. ఇకనైనా సర్కారు స్పందించి రైతులను ఆదుకోవాలి.
– గర్శె భీమయ్య, రైతు, విలేజ్ నస్పూర్