రూ .5 లక్షలతో బాధిత కుటుంబాలకు ఊరట
దస్తురాబాద్,ఫిబ్రవరి6 : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బీమా పథకం అన్నదాతల కుటుంబాలకు కొండంత అండగా నిలుస్తున్నది. ఇంటి పెద్ద ఉన్నట్టుండి కాలం చేస్తే, ఆ కుటుంబాలకు ప్రభుత్వం కల్పించిన బీమా భరోసా ఇస్తున్నది. రైతు సంక్షేమ కోసం ఏ ప్రభుత్వాలు చేయని ఆలోచనను సీఎం కేసీఆర్ అమలు చేసి చూపుతున్నారు.రైతు సహజ మరణం పొందినా లేదా ప్రమాదవశాత్తు మరణించినా రూ .5 లక్షల బీమా వర్తింపజేస్తూ ప్రభుత్వం తీసుకవచ్చిన ఈ పథకం చరిత్రలో నిలిచిపోతుంది.
52 కుటుంబాలకు సాయం..
మండలంలో మొత్తం 4829 మంది రైతులు ఉన్నారు. ఇందులో 13 పంచాయతీల్లో రైతు బీమాకు 3067 మంది రైతులు అర్హులు ఉన్నారు. గత నాలుగేళ్లలో 53 కుటుంబాలకు రూ .2 .65 కోట్ల సాయం అందించారు. మండలంలో 2018లో 15 మంది , 2019లో 13 మంది , 2020లో 15 మంది, 2021లో 9 మంది రైతులు మరణించారు. మొత్తం 52 కుటుంబాలకు ఈ పథకం కింద రూ 5 లక్షల చొప్పున సాయం అందించారు.
అప్పులు కట్టుకున్నం ..
నా భర్త ఏడాదిన్నర క్రితం అప్పుల బాధతో ఆత్మ హత్య చేసుకొని మరణించాడు. రైతు బీమా కోసం దరఖాస్తు చేసుకున్నాం. 15 రోజుల్లోనే రూ. 5లక్షలు బ్యాంకుల ఖాతాలో జమ అయినట్లు మెసేజ్ వచ్చింది. సీఎం కేసీఆర్ సారు ఇచ్చిన రూ. 5 లక్షలతో మాకున్న అప్పులు కట్టుకున్నాం. రైతు బీమా పథకంతో రైతు కుటుంబాలకు కొండంత ధీమా ఇచ్చాడు. సీఎం కేసీఆర్ సార్కు ఎప్పటికీ రుణపడి ఉంటాం.
–బత్తుల మల్లవ్వ, లబ్ధిదారు,మున్యాల