తలమడుగు, మార్చి 21 : అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం తలమడుగు మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబీకులు తెలిపిన కథనం ప్రకారం.. మండలంలోని సుంకిడి గ్రామానికి చెందిన కుమ్మరి లింగన్న (48)కు సుంకిడి శివారు ప్రాంతంలో నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. పత్తి పంట పండించగా పంట దిగుబడి రాలేదు.
పంట సాగు చేసేందుకు బ్యాంక్లో రూ.3 లక్షలు అప్పు చేశాడు. రైతు రుణమాఫీ, రైతు భరోసా రాకపోవడంతో చేసిన అప్పులు ఎలా తీర్చాలనే బెంగతో శుక్రవారం ఉదయం ఎడ్ల బండితో తన పొలానికి వెళ్లి చేనులో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. లింగన్నకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ అంజమ్మ తెలిపారు.