బాసర, నవంబర్ 6 : ‘అప్పు కడతారా.. లేకపోతే వయస్సులో ఉన్న నీ కూతురు సంగతి చూస్తాం..’ అని అప్పు వచ్చిన వారు వేధింపులకు గురి చేయడంతో ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లాకేంద్రంలోని నల్కర్ రోడ్లో నివాసం ఉంటున్న ఉప్పలించి వేణు-అనురాధలకు కూతురు పూర్ణిమ ఉంది. వీరు ఓ చిన్న వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించేవారు.
అయితే వీరు గంజి మార్కెట్లోని రోషన్, వికాస్ల వద్ద సుమారు రూ.3 లక్షలు అప్పుగా తీసుకున్నారు. దీనికి వారు చక్రవడ్డీ వేసి అప్పు కట్టమని వేధించారు. లేదంటే వయస్సులో ఉన్న నీ కూతురు సంగతి చూస్తామని బేదిరింపులకు పాల్పడ్డారు. గత్యంతరం లేక బుధవారం బాసర వద్ద గోదావరిలో దూకారు. గమనించిన స్థానికులు వారిని కాపాడే ప్రయత్నం చేశారు. భర్త వేణు(55) మృతిచెందగా.. కూతురు పూర్ణిమ(25) గల్లంతయింది. భార్య అనురాధను కాపాడారు. అనురాధ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గణేశ్ తెలిపారు.