సారంగాపూర్, మార్చి 29 ః గ్రామాల్లో వలసలు తగ్గించి ఉపాధితోపాటు రైతులకు చేయూత అందించాలనే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తున్నాయి. యేటా వేసవిలో వ్యవసాయ పనులు తక్కువగా ఉన్నప్పుడు ఉపాధి కూలీలు అధిక సంఖ్యలో హాజరువుతుంటారు. కానీ.. కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీల్లో ఫీల్డ్ అసిస్టెంట్లను నియమించకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం అమలులో ఉన్న ఉపాధి హామీ పథకాన్ని ఏప్రిల్ 1 నుంచి వికసిత భారత్ జీరాంజీ పథకంగా మార్పులు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ పథకం అమలులో కీలకంగా వ్యవహరించే గ్రామస్థాయిలో ఉండే ఫీల్డ్ అసిసెంట్ల పోస్టులను భర్తీ చేయడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయి.
ఎఫ్‌ఏలే కీలకం..
కూలీలకు పనులు కల్పించడం, మస్టర్ల కేటాయింపు, పనుల పర్యవేక్షణ, జాబ్‌కార్డుల మంజూరు, ఆధార్ అనుసంధానం, వసతి ఏర్పాట్ల వంటి పనులను ఫీల్డ్ అసిస్టెంట్లు నిర్వహిస్తుంటారు. నిర్మల్ జిల్లాలో ప్రస్తుతం 400 గ్రామ పంచాయతీలు ఉండగా, 201 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు మాత్రమే పని చేస్తున్నారు. 2018 నుంచి నిర్మల్ జిల్లాలో నేటి వరకు 163 కొత్త గ్రామపంచాయతీలు ఏర్పడ్డాయి. కానీ.. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడి రెండు సంవత్సరాలకు పైగా కావస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ల నియామకాలు జరపలేదు. దీంతో అనుభవం ఉన్న సీనియర్ కూలీ మేట్‌ను గుర్తించి పనులు చేయించే బాధ్యత అప్పగిస్తున్నారు. సీనియర్ మేట్లే అదనపు గ్రామాల పనుల బాధ్యతలను చూసుకోవాల్సి వస్తున్నది. ఇందులో ఉద్యోగ భద్రత లేకపోవడంతోపాటు చాలీచాలని వేతనాలు సకాలంలో అందక పనులు నెలల తరబడి పెండింగ్‌లో ఉంటున్నాయి.
పర్యవేక్షణ కొరవడి..
కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీల్లో మేట్లు ఉపాధి హామీ పనుల బాధ్యత చూసుకుంటున్నారు. మేట్లు తప్పిదాలు చేసినా ఫీల్డ్ అసిస్టెంట్లు బాధ్యులు కావాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మరోవైపు వారికి పూర్తిస్థాయి బాధ్యతలు లేకపోవడంతో ఉపాధి హామీ పనుల్లో పురోగతి లేకుండా పోతున్నదని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కొందరు కూలీలు పనులకు హాజరు కాకున్నా.. హాజరు వేసి అవకతవకలకు పాల్పడినట్లు ప్రజావేదికల్లో బయటపడ్డ ఘటనలు చాలా జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి.
మస్టర్లపై దొంగ సంతకాలు వేసి కూలీల ఖాతాల్లో జమ కాగానే సిబ్బంది చేతివాటం ప్రదర్శించిన సందర్భాలు వెలుగు చూశాయి. సిబ్బంది తమ బంధువులు, కుటంబ సభ్యుల పేరిట ఉపాధి డబ్బులు మింగిన ఘటనలు ఉన్నాయి. గ్రామాలకు కొత్త పనులు కేటాయించడం, నర్సరీల నిర్వహణ, కూలీలకు వేతనాల మంజూరు వంటి విషయాల్లో పర్యవేక్షణ కొరవడుతున్నది. సరైన సమయానికి కూలీ డబ్బులు అందకపోవడం వంటి సమస్యలు ఏర్పడుతున్నాయి. దీనికి తోడు ఏప్రిల్ నుంచి కొత్తగా ఐరిష్ యాప్ అమలులోకి రానుండడంతో ఏఫ్ఏలు, మేట్లకు ఇబ్బంది కానుంది. ఇప్పటికైన అధికారులు స్పందించి ఫీల్డ్ అసిసెంట్ల పోస్టులను భర్తీ చేయాలని పలువురు కోరుతున్నారు.
కొత్త జీపీలకు ఫీల్డ్ అసిస్టెంట్లను నియమించాలి..
నిర్మల్ జిల్లాలో కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీల్లో ఫ్రభుత్వాలు ఫీల్డ్ అసిస్టెంట్లను నియమించకపోవడంతో చాలా ఇబ్బందులు తలెత్తున్నాయి. ఒక్కొక్క ఫీల్డ్ అసిస్టెంట్‌కు నాలుగు నుంచి ఐదు గ్రామ పంచాయతీలు ఉండడంతో హాజరు విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రభుత్వాలు కొత్తగా తీసుకొచ్చిన ఐరీష్ విధానం వల్ల కూలీల ఫొటో తీయడం కష్టంగా మారుతుంది. కూలీలు ఉదయం 8 గంటలకు పని ప్రదేశానికి వెళ్తే మొదటి ఫొటో తీసిన తరువాత రెండో ఫొటో నాలుగు గంటల సమయం పడుతుంది. దీంతో ఎండ వేడిని తట్టుకోవడం కష్టంగా ఉంది. ఐరీష్ విధానం వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొత్త జీపీలకు ఎఫ్‌ఏలను నియమిస్తే బాధలు తగ్గుతాయి. దీనికి తోడు నెలనెల వేతనాలు రాక పిల్లల చదువు, కుటుంబ పోషణ భారంగా మారింది. వేతనాలు రాకపోవడం వల్ల ఫీల్డ్ అసిస్టెంట్లు పని ప్రదేశానికి వెళ్లాలంటే బైక్‌లో పెట్రోలు, డీజిల్ పోయడానికి కష్టంగా మారింది. ప్రభుత్వ నుంచి ఏఫ్ఏలకు మూడు నెలల వేతనాలు రావాల్సి ఉంది.
– సాయేందర్, ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం అధ్యక్షుడు, నిర్మల్ జిల్లా
