మంచిర్యాల అర్బన్, ఫిబ్రవరి 15 : జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో ఈ నెల 17 నుంచి మార్చి 5వ తేదీ వరకు విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా వైద్యాధికారి హరీశ్రాజ్ తెలిపారు. శనివారం జిల్లా వైద్యాధికార్యాలయంలో విద్య, వైద్య శాఖాధికారులతో సమావేశం నిర్వహించారు. మొదటి విడుతలో 2024-ఏప్రిల్లో 164 గురుకులాల్లో 11,949 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు చేశామన్నారు. ఇందులో 449 మంది విద్యార్థులకు కంటి సమస్యలు గుర్తించినట్లు తెలిపారు. 2024-ఆగస్టులో నిర్వహించిన రెండో విడుతలో 568 ప్రభుత్వ పాఠశాలల్లో 24 వేల మంది విద్యార్థులకు పరీక్షలు చేయగా, 694 మంది విద్యార్థులకు కంటి సమస్యలు ఉన్నట్లు గుర్తించి రికార్డు చేశారన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రెండు విడుతల్లో గుర్తించిన పిల్లలకు వైద్యులు సరిత రాథోడ్, చంద్రబాన్, శిల్ప, జిల్లా అఫ్తాల్మిక్ అధికారి శంకర్ భాసర్ రెడ్డి, జిల్లా కంటి వైద్యాధికారి డాక్టర్ యశ్వంతరావు ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. నోడల్ అధికారిగా జిల్లా ఇమ్యూనేషన్ అధికారిణ డాక్టర్ అనితను నియమించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులకు సూచించారు. జిల్లా మాస్ మీడియా అధికారి వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.