
ఇచ్చోడ, డిసెంబర్ 6 : ఒమిక్రాన్ వైరస్ బారిన పడకుండా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కొవిడ్ టీకా తీసుకోవాలని జడ్పీ సీఈవో గణపతి సూచించారు. మండలంలోని అడెగామ(బీ), కేశవపట్నం, బోరిగామ గ్రామాలతో పాటు మండల కేంద్రంలోని ఇస్లాంపుర, సుభాష్‌నగర్‌లో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాలు సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా జడ్పీ సీఈవో మాట్లాడుతూ ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి పెరుగుతున్నందున ప్రజలు జాగ్రత్తలు పాటించేలా వైద్యాధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో రాంప్రసాద్, ఎంపీవో రమేశ్, వైద్యాధికారి ఆకుదారి సాగర్, పంచాయతీ కార్యదర్శులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
మండల కేంద్రంలో వైద్య శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఇంటింటికీ వ్యాక్సినేషన్ ప్రక్రియను డీఎంహెచ్‌వో రాథోడ్ నరేందర్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ పరిశీలించారు. వ్యాక్సినేషన్ ఎలా జరుగుతుంది మండల వైద్యాధికారి నీలోఫర్‌ను అడిగి తెలుసుకున్నారు. వారి వెంట ఎంపీడీవో సునీత, ఈవోపీఆర్డీ లింగయ్య, వైద్య సిబ్బంది ఉన్నారు.
మండలంలోని కజ్జర్ల, దేవాపూర్, ఖోడద్, గ్రామాల్లో ఏర్పాటు చేసిన వాక్సినేషన్ కేంద్రాలను ఎంపీడీవో రమాకాంత్ పరిశీలించారు. అలాగే గ్రామాల్లో చేపడుతున్న ఉపాధి హామీ, నర్సరీ పనులను పరిశీలించారు. ఆయన వెంట ఏపీవో శ్యాముల్, ఈసీ గంగాధర్, సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు.
ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని సర్పంచ్ భరత్ అన్నారు. గాదిగూడ మండలం ఆదిమ్యాన్ గ్రామంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు. వ్యాక్సిన్ తీరును సర్పంచ్ పర్యవేక్షించారు. కార్యక్రమంలో ఆరోగ్య పర్యవేక్షకుడు సంజయ్, వైద్యసిబ్బంది ఉన్నారు.