ప్రభుత్వ దవాఖానల్లో మారనున్న మెనూ
ఏప్రిల్ నుంచి అమల్లోకి తెచ్చేందుకు కసరత్తు
రాష్ట్ర సర్కారు నిర్ణయంపై సర్వత్రా హర్షం
నిర్మల్ చైన్గేట్, మార్చి 22:పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా ప్రభుత్వ దవాఖానలను రాష్ట్ర సర్కారు తీర్చిదిద్దుతున్నది. సకల వసతులతో పాటు ఆధునిక పరికరాలు, నిపుణులైన వైద్యులను అందుబాటులో ఉంచుతున్నది. దీంతో పాటు వివిధ చికిత్సల కోసం దవాఖానల్లో చేరే రోగులకు, సేవలందించే వైద్యులకు కడుపునిండా పోషకాహారాన్ని అందించేందుకు నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న డైట్ చార్జీలను రెట్టింపు చేస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. వీటిని ఏప్రిల్లో అమల్లోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తుండగా, సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
ప్రజారోగ్యానికి ప్రాధాన్యమిస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. సర్కారు వైద్యశాలల్లో మెరుగైన వైద్య సేవలందిచడంపై దృష్టి పెట్టింది. హాస్పిటళ్లకు వైద్యం కోసం వచ్చిన వారికి కడుపునిండా భోజనం పెట్టేందుకు డైట్ చార్జీలను రెట్టింపు చేసింది. వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దవాఖాన్లలో ఇన్పేషెంట్లుగా వారికి రోజుకు రూ.40 చొప్పున ఉన్న డైట్ చార్జీలను రూ.80 పెంచారు. డాక్టర్లకు అందిస్తున్న డైట్ రూ.80 నుంచి రూ.160 పెంచుతూ తీసుకున్న నిర్ణయంపై రోగు లు, వైద్య సిబ్బంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు. టీబీ, మానసిక, ఫిజియోథెరపీ రోగులకు రూ.56 ఉన్న చార్జిని రూ.112 కు పెంచింది. ప్రస్తుతం అమలు చేస్తున్న డైట్ చార్జీలు రెట్టింపు కావడంతో రోగులకు మరింత విలువైన పోషకాహారం అందనుంది. ఇటీవల రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఆయా జిల్లాల్లో పర్యటించగా రోగులకు అందిస్తున్న భోజనంపై ఆరా తీయగా చార్జీలు తక్కువగా ఉన్నాయని ఫిర్యాదులు రావడంతో స్పందించిన మంత్రి చార్జీల పెంపు నిర్ణయాన్ని తీసుకున్నారు. నిర్ణయాన్ని ఏప్రిల్ నుంచే అమలు చేసే అధికారులు కసరత్తు చేస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో పేద రోగులకు పోషకాహారం
నిర్మల్, భైంసా, ఆదిలాబాద్, మంచిర్యాల, కాగజ్నగర్, బెల్లంపల్లి, లక్షటిపేట, ఉట్నూర్తో పాటు నర్సాపూర్, ముథోల్, ఖానాపూర్, మందమర్రి, చెన్నూర్ తదితర సామాజిక దవాఖానలు ఉన్నాయి. ఆయా వైద్యశాలల్లో శస్త్ర చికిత్సలు చేసుకొని ఏడు రోజుల పాటు ఉంటున్న రోగులతో పాటు బాలింతలకు పోషకాహారాన్ని పంపిణీ చేస్తున్నారు. ఒక్కో దవాఖానలో రోజుకు కనీసం 40 నుంచి 100 మంది వరకు ఏజెన్సీల ద్వారా భోజనం సరఫరా చేస్తున్నారు. ఇందులో ఉద యం టిఫిన్, మధ్యాహ్నం రాత్రివేళల్లో భోజనం అందిస్తున్నారు. ఇందులో అన్నం పప్పు, కూరగాయ, గుడ్డు, పాలు, బ్రెడ్, పండ్లు ఇలా రోగులకు డైట్ చార్జీల కింద ఒక్కో రోగికి రూ.40 చొప్పున ప్రభుత్వం చెల్లిస్తున్నది. మార్కెట్లో ధరలు పెరగడం, పోషకాహారాన్ని పాత చార్జీలకు సరితూగకపోవడంతో నాసిరకం భోజనం అందిస్తున్నారనే అపవాదును తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చార్జీల పెంపుపై నిర్ణయం తీసుకుంది. దీంతో ఆసుపత్రి వర్గాలు, రోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.