ఖానాపూర్, జూన్ 15 : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు ఉద్యమ స్ఫూర్తితో విజయవంతం చేయాలని బీఆర్ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్ పిలుపునిచ్చారు. సోమవారం ఖానాపూర్ పట్టణంలోని పార్టీ క్యాంపు కార్యాలయంలో పార్టీ సభ్యత్వ నమోదు ఇన్చార్జి సుమిత్ర ఆనంద్ తనోబాతో కలిసి నిర్వహించిన సన్నాహక సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన నుంచి రాష్ట్ర అభివృద్ధి వరకు బీఆర్ఎస్ పార్టీ ప్రజల కోసం నిరంతరం పనిచేసిందని, అలాంటి పార్టీని మరింత బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కేవలం నమోదుతో పరిమితం చేయకుండా పార్టీ పునర్నిర్మాణం, సంస్థాగత బలోపేతానికి అవకాశంగా భావించి పనిచేయాలని సూచించారు.
ప్రతి గ్రామంలో ఇంటింటికీ వెళ్లి పార్టీ సిద్ధాంతాలు, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అమలైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించి కొత్త సభ్యులను చేర్చాలని కోరారు. ముఖ్యంగా యువత, మహిళలు, రైతులు, కార్మికులు, గిరిజనులు, ఆదివాసీలు సహా అన్ని వర్గాలను సభ్యత్వ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలని తెలిపారు. డిజిటల్ విధానంలో సభ్యత్వ నమోదు ప్రక్రియను వేగవంతం చేసి ప్రతి బూత్ పరిధిలో నిర్దేశిత లక్ష్యాలను సాధించాలని సూచించారు. సభ్యత్వ నమోదులో ఎలాంటి నిర్లక్ష్యం, అలసత్వం చోటుచేసుకోకుండా నాయకులు, కార్యకర్తలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. పార్టీ కోసం అంకితభావంతో పనిచేసే కార్యకర్తలే పార్టీకి వెన్నెముక అని పేరొన్నారు.
ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పార్టీ దృష్టికి తీసుకురావాలని నాయకులకు దిశానిర్దేశం చేశారు. గ్రామాలు, మండలాల్లో ప్రజలు ఎదురొంటున్న సమస్యలపై అప్రమత్తంగా ఉండి వాటి పరిషారం కోసం పార్టీ తరఫున పోరాటాలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ప్రజాస్వామ్య రక్షణ, ప్రజల హకుల సాధన, సామాజిక న్యాయం కోసం బీఆర్ఎస్ పార్టీ నిరంతరం కట్టుబడి పని చేస్తున్నదని తెలిపారు. రాబోయే రోజుల్లో పార్టీ కార్యక్రమాలను విసృ్తతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి, గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మహ్మద్ షోయోబ్, కౌన్సిలర్ తాళ్లపల్లి రాజగంగన్న, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సక్కారం శ్రీనివాస్, మాజీ జడ్పీటీసీ రామునాయక్, నాయకులు గౌరికర్ రాజు, పుప్పాల గజేందర్, అబ్దుల్ ఖలీల్, జీవన్‌రెడ్డి, కొడారి గోపాల్, సల్ల నరేందర్, వాల్సింగ్, గాండ్ల శంకర్, గడ్డం రవీందర్, కేహెచ్ ఖాన్, రాజేశ్వర్ గౌడ్, నసీర్, ధరంసోత్ వసంత్ పాల్గొన్నారు.