నిర్మల్ జిల్లా వ్యాప్తంగా చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ తుది దశకు చేరుకున్నది. ఇందులో భాగంగా నకిలీ ఓట్ల ఏరివేత ప్రక్రియ ముమ్మరంగా సాగుతున్నది. ఇప్పటికే ఓటర్ల జాబితాలో భారీ ప్రక్షాళన జరిగినట్లు సమాచారం. వివిధ కారణాలతో ఏకంగా 87 వేలకు పైగా ఓట్లను అధికారులు జాబితా నుంచి తొలగించనున్నట్లు తెలుస్తున్నది. ఒకేసారి ఇంత పెద్ద సంఖ్యలో ఓట్లు తొలగిపోతుండడం జిల్లా రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నది.
నిర్మల్, జూలై 26(నమస్తే తెలంగాణ): నిర్మల్ జిల్లాలో మూడు నియోజకవర్గాల్లో ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియ తుది దశకు చేరుకున్నది. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడంతో పాటు, జాబితాలో ఉన్న తప్పులను సరిదిద్దేందుకు అధికారులు ముమ్మర కసరత్తు చేస్తున్నారు. డూప్లికేట్తో పాటు మరణించిన, శాశ్వతంగా వలస వెళ్లిన వారి వివరాలను క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా గుర్తించడంతో ఇప్పటి వరకు ఈ 87వేల మందికి పైగా ఓటర్ల వివరాలు అధికారులకు అందలేదు. మూడు నియోజకవర్గాల్లోనూ పెద్ద సంఖ్యలో ఓట్లు తొలగిపోనున్నట్లు స్పష్టమవుతున్నది. దీంతో ఈ భారీ మార్పు రాబోయే ఎన్నికల సమీకరణాలను మార్చే అవకాశం ఉందని ప్రధాన పార్టీల్లో అప్పుడే టెన్షన్ మొదలైంది. జిల్లాలో ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ 95శాతం వరకు పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. ఆగస్టు 3న ఓటర్ల ముసాయిదా జాబితాను విడుదల చేసేందుకు యంత్రాంగం అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నది.
ప్రస్తుతం నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా ప్రక్షాళనలో జిల్లాలో ఓట్ల సంఖ్య భారీగా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. క్షేత్రస్థాయి పరిశీలనలో అందుబాటులో లేనివారు, మరణించిన వారు, ఒకే వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ నియోజకవర్గాల్లో లేదా పోలింగ్ కేంద్రాల్లో డూప్లికేట్ ఓట్లను కలిగి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీరందరికీ తమ ఓటు హక్కును కాపాడుకునేందుకు, వివరాలు సరిచేసుకునేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించినప్పటికీ.. జిల్లా వ్యాప్తంగా మొత్తం 87,885మంది ఓటర్లు ఇప్పటి వరకు తమ ఎన్యుమరేషన్ ఫారాలను సమర్పించలేదు. గడువు సమీపిస్తున్నా ఎలాంటి ఫారాలు అందకపోవడంతో, 87వేల మందికి పైగా ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించినట్లేనని అధికారులు స్పష్టం చేస్తున్నారు. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 7,55,344మంది ఓటర్లు ఉండగా, ఇప్పటి వరకు 6,34,932మంది వివరాలను డిజిటలైజేషన్ చేశారు. మరో 35,527మంది తమ ఎన్యుమరేషన్ ఫారాలను బీఎల్వోలకు అందజేసినప్పటికీ, ఇంకా వారి వివరాలు ఆన్లైన్లో నమోదు చేయలేదు. ఇవి పోగా మిగతా 87,885మంది వివరాలు ఇప్పటి వరకు బీఎల్వోలకు చేరకపోవడంతో, వారి ఓట్లు దాదాపుగా తొలగించినట్లేనని చెబుతున్నారు.
ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా జిల్లాలోని 3 నియోజకవర్గాల పరిధిలో సైతం పెద్ద సంఖ్యలో బోగస్ ఓట్లు తొలగిపోనున్నాయి. ఖానాపూర్ నియోజకవర్గం పరిధిలో మొత్తం 2,30,162మంది ఓటర్లు ఉండగా, ఇప్పటి వరకు 1,99,176మంది ఓటర్ల వివరాలను ఆన్లైన్లో నమోదు చేశారు. మరో 3,224మంది అందజేసిన ఎన్యుమరేషన్ ఫారాలను డిజిటలైజేషన్ చేయాల్సి ఉంది. ఇవి పోగా మిగతా 27,762మంది ఓటర్ల వివరాలు ఇప్పటి వరకు బీఎల్వోలకు అందకపోవడంతో వారి ఓట్లు తొలగించినట్లేనంటున్నారు. నిర్మల్ నియోజకవర్గంలో మొత్తం 2,64,070మంది ఓటర్లుండగా, ఇప్పటి వరకు 2,15,328మంది ఓటర్ల వివరాలను ఆన్లైన్లో నమోదు చేశారు. మరో 18,521మంది అందజేసిన ఎన్యుమరేషన్ ఫారాలను డిజిటలైజేషన్ చేయాల్సి ఉంది. ఇవి పోగా మిగతా 30,221మంది ఓటర్ల వివరాలు ఇప్పటి వరకు బీఎల్వోలకు అందకపోవడంతో, వారి ఓట్లు తొలగించినట్లేనంటున్నారు. ముథోల్ నియోజకవర్గంలో మొత్తం 2,61,112మంది ఓటర్లు ఉండగా, ఇప్పటి వరకు 2,20,428మంది ఓటర్ల వివరాలను ఆన్లైన్లో నమోదు చేశారు. మరో 10,782 మంది అందజేసిన ఎన్యుమరేషన్ ఫారాలను డిజిటలైజేషన్ చేయాల్సి ఉంది. ఇవి పోగా మిగతా 29,902 మంది ఓటర్ల వివరాలు ఇప్పటి వరకు బీఎల్వోలకు అందకపోవడంతో, వారి ఓట్లు సైతం తొలగించినట్లేనంటున్నారు.
కాగా బూత్ స్థాయి అధికారులు (బీఎల్వోలు) ఇంటింటికీ తిరిగి సేకరించిన సమాచారం ఆధారంగానే ఈ తొలగింపులు జరుగుతున్నాయని తెలుస్తున్నది. బోగస్, డూప్లికేట్ ఓట్లకు తావులేకుండా ఒక పారదర్శకమైన ఓటర్ల జాబితాను సిద్ధం చేయడమే లక్ష్యంగా ఈ ‘ఎస్ఐఆర్’ ప్రక్రియను చేపట్టినట్లు అధికారులు చెబుతున్నారు. డిజిటలైజేషన్ ప్రక్రియ దాదాపు పూర్తి కావడంతో, వచ్చే ఆగస్టు 3న విడుదల కాబోయే ముసాయిదా జాబితాపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.