మంచిర్యాల, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మంచిర్యాల మున్సిపాలిటీలోని ఇంజినీర్ల వ్యవహారశైలి విమర్శలకు తావిస్తున్నది. బల్దియా జనరల్ ఫండ్ నుంచి రూ. 2 కోట్ల అంచనాతో 45 పనులకు టెండర్ల వ్యవహారంలో మరో నిర్లక్ష్యం వెలుగుచూసింది. గత నెల ఈ పనులకు సంబంధించిన టెండర్లను మున్సిపల్ చైర్మన్ ఉప్పలయ్య, వైస్ చైర్మన్ మహేశ్ ఆధ్వర్యంలో కొందరు కౌన్సిలర్లు, కాంట్రాక్టర్లు కలిసి లాటరీ పద్ధతిలో పంచుకున్నారు. దీనిపై పత్రికల్లో కథనాలు రాగా, స్పందించిన మున్సిపల్ కమిషనర్ మారుతీప్రసాద్ ఆ టెండర్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
ఇలాంటి ఘటనలు పునరావృతం కావద్దని కిందిస్థాయి అధికారులను హెచ్చరించారు. ఇంత జరిగినా మంచిర్యాల మున్సిపాలిటీ ఇంజినీర్ల తీరు మారలేదు. ప్రతి వార్డుకు రూ. 4 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు జనరల్ ఫండ్ నుంచి చేయాల్సిన పనులకు శుక్రవారం టెండర్లు పిలిచారు. గత నెలలో రద్దు చేసిన పనులకు మరోసారి టెండర్లు పిలుస్తుండడంతో ఈ సారైనా నిబంధనల ప్రకారం చేస్తారని అంతా భావించారు. కానీ మంచిర్యాల 23వ వార్డులో ఇప్పటికే పూర్తయిన పనులకు టెండర్లు పిలవడం గమనార్హం.
స్లాటర్ హౌస్ నుంచి అయ్యప్ప టెంపుల్ దగ్గరున్న డ్రైనేజీ వరకు సీసీ రోడ్డుతో పాటు మరో రెండు పనులకు రూ.4,04,108కు, అలాగే బైపాస్ రోడ్ నుంచి స్లాటర్ హౌస్‌కు వెళ్లేందుకు ర్యాంప్ నిర్మాణానికి రూ.1,61,172కు టెండర్లు పిలిచారు. కాగా, ఈ రెండు పనులు పూర్తయిపోయాయి. రోడ్డు నిర్మాణం ఈ రోజే (శుక్రవారం) హడావుడిగా పూర్తి చేశారు. ర్యాంప్ నిర్మాణం కూడా ఈ మధ్యే చేసేశారు. మరి టెండర్లు పూర్తి కాకముందే పనులు ఎలా చేశారు. పనులు పూర్తయ్యాక టెండర్ ఎలా చేశారు.. ఎవరి మొప్పు కోసం ఇలా చేశారనేది అంతుబట్టడం లేదు.
పూర్తయిన పనులకు టెండర్లు ఎలా పిలుస్తారని మున్సిపల్ ఇంజినీర్ మసూద్‌ను వివరణ కోరగా, అంతకుముందు చేసిన పనుల్లో మిగిలిన నిధులతో ఆ పనులు చేసి ఉండొచ్చన్నారు. సాధారణంగా ఏదైన ఒక వార్డులో పనులు పూర్తి చేశాక, ఫండ్స్ మిగిలిపోతే ఆ డబ్బుతో వేరే పనులు చేయవచ్చు. గతంలోనూ ఈ తరహాలు పనులు చేశారు. కానీ, అలా మిగిలిన ఫండ్స్‌తో పూర్తయిన పనులకు తిరిగి టెండర్ పిలవడం అనేది గతంలో ఎప్పుడూ జరగలేదు.
ఇది నిబంధనలకు పూర్తిగా విరుద్ధం. మిగిలిన డబ్బులతో చేసిన పనులకు మళ్లీ టెండర్ అంటే బిల్లులు కొట్టేయడమే తప్ప మరొకటి కాదని కొందరు కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. ఇదే విషయాన్ని మున్సిపల్ ఇంజినీర్ దగ్గర ప్రస్తావించగా పనులు జరిగిన విషయం తమ దృష్టికి రాలేదంటూ ముందు ఒకలా, తర్వాత మరోలా సమాధానం ఇవ్వడం అనుమానాలకు తావిస్తున్నది. అధికారులకు అంతా తెలిసే ఇదంతా చేస్తున్నారంటూ కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు.
అధికార పార్టీకి చెందిన కొందరు నాయకుల కనుసన్నల్లోనే ఈ వ్యవహారం నడుస్తుందంటూ మండిపడుతున్నారు. దీనిపై 23వ వార్డు కౌన్సిలర్ బానేష్ను వివరణ కోరగా.. చనిపోయినవారి దహన సంస్కారాలకు ఆ రోడ్డులో వెళ్లేందుకు జనాలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. త్వరితగతిన పనులు పూర్తి కావాలనే ఉద్దేశంతోనే రోడ్డు వేయించాం తప్ప వేరేది లేదన్నారు. మరి ఈ వ్యవహారంపై మున్సిపల్ అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి. మిగిలిన ఫండ్స్‌తో పనులు చేశారు కాబట్టి ఈ టెండర్లను రద్దు చేస్తారా.. లేక పూర్తయిన పనులకు మరోసారి బిల్లులు మంజూరు చేసి చేతులు దులుపుకుంటారా అన్నది తేలాల్సి ఉంది.