మంచిర్యాల అర్బన్, సెప్టెంబర్ 21 : తీరొక్కపూలతో పేర్చి ప్రకృతిని ఆరాధిస్తూ ఆనందోత్సాహాల మధ్య సాగే బతుకమ్మ పండుగ ఆదివారం ప్రారంభమైంది. మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మ వేడుకల్లో మహిళలు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
పట్టణాలు, పల్లెలు తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో… బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ మహిళలు ఆటాపాటలతో సందడి చేశారు. మహిళలు వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. బతుకమ్మ ఆడిన తర్వాత స్థానికంగా ఉన్న చెరువులు, కుంటల్లో వాటిని నిమజ్జనం చేశారు.