సారంగాపూర్, మే 24 : నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని స్వర్ణ గ్రామంలో గల ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. కోట్లాది రూపాయల విలువ చేసే భూములు అక్రమణకు గురవుతున్నాయి. అధికారుల అలసత్వం వల్ల అక్రమణదారులు ప్రభుత్వ భూములు చెరబట్టి ఇండ్ల నిర్మాణాలు చేస్తున్నారు. 1970 సంవత్సరంలో గ్రామ పరిధిలోని స్వర్ణ నదిపై 2500 ఎకరాల విస్తీర్ణంలో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు పరిసరాల్లో ప్రభుత్వ భూమి మిగిలింది. స్వర్ణ గ్రామాన్ని ఆనుకొని కొంత, ప్రాజెక్టు దిగువన మరికొంత భూమి దాదాపు వందల ఎకరాలు మిగిలింది. ఈ భూమిపై అక్రమార్కుల కన్ను పడింది. గ్రామాన్ని ఆనుకొని ఉన్న భూమిని ఆక్రమిస్తూ ఇండ్ల నిర్మాణాలు చేపడుతున్నారు.
అలాగే ప్రాజెక్టు చుట్టూ ప్రక్కల గ్రామాలు స్వర్ణ, జౌళి, కుప్టి, రాంసింగ్తాండ, పొట్యా, అప్పారావుపేట్ గ్రామాల్లో విలువైన భూములు చెరబట్టి వ్యవసాయం చేస్తున్నారు. గ్రామాలకు చెందిన వ్యక్తులు ఐదు నుంచి పదెకరాలు కబ్జా చేసి రెండు పంటలు పడిస్తున్నారు. జౌళి గ్రామంలో ప్రాజెక్టు భూములను అమ్ముకోవడమే కాకుండా ఇందిరమ్మ ఇండ్లను నిర్మించుకుంటున్నారన్న విమర్శలున్నాయి. ఈ తతంగం కండ్ల ముందే జరుగుతున్నా అధికార యంత్రాంగం చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నదన్న ఆరోపణలు ఉన్నాయి. అధికారులు వత్తాసు పలకడంతోనే కోట్ల రూపాయల విలువైన భూములు అన్యాక్రాంతం అవుతున్నాయన్న ఆరోపణలు వినిస్తున్నాయి. అధికారులు స్పందించి ప్రాజెక్టు భూములను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.
స్వర్ణ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టినప్పుడు ప్రాజెక్టులో పనిచేసే సి బ్బంది కొరకు స్వర్ణ గ్రామంలో క్వార్టర్స్ నిర్మించారు. అప్పుడు సిబ్బంది క్వార్టర్స్‌లో ఉండి విధులు నిర్వహించేవారు. అయితే కొన్నేండ్ల క్రితం నుంచి సిబ్బంది లేక నిరుపయోగంగా మారా యి. దీంతో కొందరు క్వార్టర్స్‌లను ఆక్రమించుకొని వేరే వ్యక్తులకు అద్దెకు ఇచ్చి, షెడ్లు నిర్మించుకుంటున్నారని గ్రామస్తులు ఆ రోపిస్తున్నారు. మరి కొందరు ఇందిరమ్మ ఇండ్లు, ఇతర ఇండ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. ఇంత జరుగుతున్నా ఇరిగేషన్ అ ధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వ్యక్తం అవుతున్నా యి. స్థానిక ప్రజాప్రతినిధుల అండదండలతోనే క్వార్టర్స్ ఆక్రమణలు జరిగాయన్న విమర్శలున్నాయి. బస్టాండ్‌కు ఆనుకొని కోట్లు విలువ చేసే భూమిని అధికారులు కాపాడలేక పోతున్నారంటే.. భూముల మీద ఏ మేరకు చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవచ్చు.

స్వర్ణ గ్రామానికి చెందిన కొందరు కొన్నేండ్లుగా ప్రాజెక్టు క్వార్టర్స్‌లో ఉంటున్నారు. అనంతరం ఇతరులకు అమ్మడం, అద్దె ఇస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని గత సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని గ్రీవెన్స్‌లో గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసి వారం రోజులు కావస్తున్నా క్వార్టర్స్ కబ్జాదారులపై చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ప్రాజెక్టు క్వార్టర్స్ ప్రభుత్వ భూమి లేకుండా పోతున్నదని గ్రామస్తులు పేర్కొంటున్నారు. అధికారులు స్పందించి సర్వే చేసి ప్రాజెక్టు భూములు, క్వార్టర్స్‌లను కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు.

నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని స్వర్ణ ప్రాజెక్టు క్వార్టర్స్‌లో ఆక్రమంగా నిర్మించుకున్న రేకుల షెడ్లు

ఆక్రమణకు గురైన ప్రాజెక్టు క్వార్టర్స్

స్వర్ణ ప్రాజెక్టు భూముల్లో సాగు చేస్తున్న వ్యక్తులు
స్వర్ణ భూముల ఆక్రమణపై సర్వే చేయించాలని ఆర్డీవో, కలెక్టర్లకు విన్నవించాం. సర్వేయర్లు తక్కువగా ఉండడం వల్ల సర్వే ఆలస్యం అవుతున్నది. సర్వేయర్లు వచ్చిన వెంటనే భూములు సర్వే చేయిస్తాం. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు అనుమతి ఇవ్వకూడదని ఎంపీడీవోలకు చెప్పాం. ప్రాజెక్టు భూముల్లో ఇందిరమ్మ ఇండ్లు నిర్మించ కూడదు. ఎవరైన నిర్మాణాలు చేపడితే వారి వివరాలు మా డీఈకి చెబితే ఇండ్ల నిర్మాణాలు ఆపివేస్తాం.
– అనిల్‌జాదవ్, ఈఈ, స్వర్ణ ప్రాజెక్టు.