ఆదిలాబాద్, సెప్టెంబర్ 18(నమస్తే తెలంగాణ) : తెలంగాణ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్(టీజీఎన్పీడీసీఎల్) యాప్‌కు పలు అంశాలతో అందుబాటులోకి వచ్చినట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. 19 ఫీచర్లతో ఈ యాప్ ఉంటుందని ఆదిలాబాద్ ఎన్పీడీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజినీర్ జయవంత్‌రావు చౌహాన్ తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు.
రిపోర్ట్ ఆన్ ఇన్సిడెంట్ : విద్యుత్ శాఖకు సంబంధించి ఎక్కడ ఏదైనా ఘటన జరిగినా యాప్‌లోని జీపీఎస్ లోకేషన్ ద్వారా వినియోగదారుడు ఫోన్లో ఫొటో తీసి పంపవచ్చు. దీంతో ఇందుకు సంబంధించిన రిపోర్టు నేరుగా సంబంధింత అధికారికి చేరుతుంది. వారు స్పందించి పరిష్కారం చేస్తారు.
కన్జూమర్ గ్రీవెన్స్, న్యూ కైంప్లెంట్స్ : వినియోగదారుడు సమస్యలను నేరుగా ఇందులో తెలియజేయవచ్చు. మీటరు నంబరు, సమస్యల వివరాలు నమోదు చేస్తే అధికారులు పరిష్కరిస్తారు. కైంప్లెంట్ స్టేటస్‌ను చూసే అవకాశం ఉండగా, పరిష్కారం విషయంలో సంతృప్తి చెందకపోతే తిరిగి ఫిర్యాదు చేయవచ్చు.
సెల్ఫ్ రీడింగ్ : వినియోగదారులు తమ మీటరుకు సెల్ఫ్ రీడింగ్ తీసుకుని పంపించవచ్చు. దీని ప్రకారం బిల్లులు జారీ అవుతాయి.
పే బిల్స్ : సర్వీస్ నంబరు నమోదు చేసుకుని ప్రతినెలా తమ విద్యుత్ బిల్లులను ఇందులో చెల్లించవచ్చు. బిల్ హిస్టరీ : తాము చెల్లించిన బిల్లుల వివరాలను తెలుసుకోవచ్చు.
ఆన్లైన్ పేమెంట్ హిస్టరీ : ఆన్లైన్ ద్వారా చెల్లించిన బిల్లుల వివరాలను చూసుకునే అవకాశం ఉంది. లింక్ ఆధార్, మొబైల్ : వినియోగదారులు తమ ఆధార్, మొబైల్ నంబర్లను లింక్ చేసుకోవచ్చు. దీంతో ప్రతినెలా బిల్లులకు సం బంధించిన సమాచారం మెస్సేజ్ వస్తుంది.
డొమెస్టిక్ బిల్ క్యాలిక్యూలేటర్ : వినియోగాదారులు నెల వారి విద్యుత్ వినియోగానికి సంబంధించిన మీటర్ రీడింగ్ వివరాలు పొందుపరిస్తే బిల్లు వివరాలను చూసుకునే అవకాశం ఉంది. న్యూ కనెక్షన్ : విద్యుత్ కనెక్షన్ కావాలనుకునే వారు ఎలా దరఖాస్తు చేసుకోవాలనే వివరాలు ఉంటాయి. పేరు, లోడ్ మార్పు : విద్యుత్ మీటర్ పేరు మార్చడానికి ఏమి చేయాలనే వివరాలు, లోడ్ వివరాలు ఉంటాయి. దీని ప్రకారం దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. పవర్ కంజప్షన్ గైడ్‌లైన్స్ : విద్యుత్ ఉపకరణాలు, దీనికి ఎంత విద్యుత్ వినియోగం అవుతుందనే వివరాలు ఉంటాయి.
టారీఫ్ డిటేయిల్స్: విద్యుత్ వినియోగ చార్జీలు క్యాటగిరీలవారీగా ఉంటాయి.
ఎనర్జీ సేవింగ్ టిప్స్ : విద్యుత్‌ను పొదుపు చేయడానికి తీసుకోవాల్సిన సూచనలు ఉంటాయి.
సెఫ్టీ టిప్స్ : విద్యుత్ ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉంటాయి.
ఫీడ్ బ్యాక్ : సంస్థ అందిస్తున్న సేవల గురించి వినియోగదారులు తమ అభిప్రాయాలు తెలియజేయవచ్చు. మై అకౌంట్ : విద్యుత్ వినియోగదారుల పూర్తి వివరాలు ఉంటాయి.
కాంటాక్ట్ యాజ్ : ఇందులో 24/7 పనిచేసే టోల్ ఫ్రీ నంబర్లు ఉంటాయి. 1912, 18004250028 నంబర్లకు ఫోన్ చేసి సమస్యను తెలియజేయవచ్చు.
వీటితోపాటు వినియోగదారుల పరిధిలోని అధికారుల వివరాలు, బిల్లులకు సంబంధించిన సమాచారం వివరాలను యాప్‌లో తెలుసుకోవచ్చని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు.
యాప్ సేవలను వినియోగించుకోవాలి..
టీజీఎన్పీడీసీఎల్ విద్యుత్ వినియోగదారుల సౌకర్యార్థం పలు ఫీచర్లతో కూడిన యాప్‌ను తయారు చేసింది. ఈ యాప్ ద్వారా వినియోగదారులకు పలు సేవలు అందుతాయి. విద్యుత్ సమస్యలు, బిల్లుల చెల్లింపులు, కొత్త కనెక్షన్లు, అధికారుల కోసం కార్యాలయాలు చుట్టూ తిరిగే అవసరం లేకుండా వినియోగదారులకు టీజీఎన్పీడీసీఎల్ యాప్ ఉపయోగపడుతుంది. వినియోగదారులు ఈ యాప్‌ను వినియోగించుకోవాలి.
– జయవంత్‌రావు చౌహాన్, ఎస్ఈ, ఎన్పీడీసీఎల్, ఆదిలాబాద్